దేనికీ భయపడను
‘జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను. నిప్పులపై నడుస్తున్నాను. ప్రజల మద్దతు ఉన్నంత వరకు నేను దేనికీ భయపడను’అని అన్నాడీఎంకే అధినేత్రి జే.జయలలిత పేర్కొన్నారు. తనకు శిక్ష పడిన విషయం తెలుసుకుని షాక్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు తలా రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. జయలలితను దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్రమంత్రి మేనకాగాంధీ లేఖల ద్వారా పరామర్శించారు.
సాక్షి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రిజే.జయలలిత శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. తాను బయటకు రావాలం టూ రేయింబవళ్లు శాంతియుత నిరసనలతో, ఆలయాల్లో పూజాధి కార్యక్రమాల్లో నిమగ్నమైన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తన జీవితాంతం మండుతున్న నదిలో ఈదుకుంటూ వస్తున్నానని పేర్కొన్నారు. ఎలాంటి బాధ, కష్టాన్ని అయినా ఎదుర్కొనే మనో ధైర్యం తనకు ఉందన్నారు. ప్రజా సేవకు అంకితమైన వారు ఎలాంటి ఒడిదొడుకుల్ని అయినా, కష్టాల్ని అయినా నిర్భయంగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాడే తాను అన్ని విషయాల్ని గ్రహించానని, అందుకే ఎంజీయార్ అడుగు జాడల్లో, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీకి నేతృత్వం వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి త్యాగాలకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా, కష్టాలు చవి చూసినా, వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నానని, చివరకు గెలుపు తన వైపు నిలిచిందని వివరించారు. తన మీద ఉన్న ప్రేమతో, తాను భయటకు రావాలన్న కాంక్షతో ఎన్నో గుండెలు కన్నీళ్లు పెట్టాయని, పూజాధి కార్యక్రమాలు చేశాయని, మరెన్నో కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారన్న విషయాన్ని తెలుసుకున్న తన హృదయం మరింతగా బరువెక్కిందన్నారు. వారందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
రూ.మూడు లక్షలు
జయలలితకు శిక్షపడ్డ నేపథ్యంలో ఆత్మాహుతులు, ఆత్మహత్యల బాట పట్టిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అలాగే తీర్పు షాక్‌తో అనేక గుండెలు సైతం ఆగాయి. ఆ కుటుంబాల్ని ఆదుకునేందుకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయించారు. ఆ మేరకు తలా రూ.మూడు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గుండెలు ఆగి 139 మంది, అగ్నికి ఆహుతై 17 మంది, ఉరి పోసుకుని 20 మంది మరణించినట్టు జాబితాను విడుదల చేశారు. అలాగే, మిద్దె మీద నుంచి పడి తొమ్మిది మంది, బస్సు ముందు దూకి ఒకరు, రైలు కింద పడి ముగ్గురు, నీళల్లో దూకి ఇద్దరు, విద్యుత్ షాక్‌తో ఒకరు చొప్పున మొత్తం 193 మంది మరణించినట్టు అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు ప్రకటించాయి.
రజనీ, మేనక పరామర్శ
దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా సంజయ్ గాంధీలు వేర్వేరు లేఖలతో జయలలితను పరామర్శించారు. ఈ మేరకు అన్నాడీఎంకే కార్యాలయం ఆదివారం ప్రకటించింది. తన లేఖలో జయలలితకు సానుభూతి, మద్దతను మేనకా గాంధీ తెలియజేశారు. జీవితంలో తమరు ఎన్నో కష్టాల్ని, ఒడి దొడుగుల్ని చవి చూశారని, వాటిన్నింటిని ఎదుర్కొన్నట్టుగానే, ప్రస్తుత కష్టాన్ని అధిగమించి త్వరితగతిన తమరు బాధ్యతలు చేపడుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, రజనీ కాంత్ తన లేఖలో మనో ధైర్యంగా ఉండాలని, ప్రశాంత పూరితంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తమరు ఆరోగ్య వంతంగా మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆంక్షిస్తూ, ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.