
రాజ్యసభ సమావేశాల ముగింపు సందర్భంగా మాట్లాడుతున్న చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలాంటి కీలక అంశాలను చేపట్టకుండానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. పెద్దల సభగా పేరొందిన రాజ్యసభలో సభ్యుల నిరవధిక ఆందోళనతో ఏకంగా 121 గంటల విలువైన సభా సమయం వృధా అయింది. వాయిదాల పర్వం, సభ్యుల ఆందోళనలతో రాజ్యసభలో 27 రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టలేదని సభాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. కేవలం 44 గంటల పాటే సభా సమయం సజావుగా సాగింది.
అటు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తీవ్ర ఆందోళనకు దిగి, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా సభ సజావుగా లేదంటూ చర్చకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటు, విగ్రహాల ధ్వంసం, ఎస్‌సీ ఎస్‌టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీం ఉత్తర్వులు వంటి పలు అంశాలపై పార్లమెంట్‌లో తీవ్ర గందరగోళం చెలరేగింది.
రాజ్యసభలో నాలుగింట మూడొంతుల సమయం సభ్యుల అభ్యంతరాలు, అవాంతరాలు, వాయిదాలతో వృధా అయింది. విలువైన సభా సమయం హరించుకుపోవడం తనను తీవ్ర విచారానికి గురిచేస్తోందని రాజ్యసభ 245వ సమావేశాల ముగింపు సందర్భంగా చైర్మన్ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.