రమణ్‘కింగ్’
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ముచ్చటగా మూడోసారి కమలం వికసించింది. కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముకున్న సానుభూతి పవనాలు, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ఉత్కంఠభరిత పోరులో విజయం చివరికి కమలం పార్టీనే వరించింది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లకుగాను 49 స్థానాలను కైవసం చేసుకుని విజయదుందుభి మోగించింది. గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈసారి కూడా 39 స్థానాలతో సరిపెట్టుకుని ప్రధాన ప్రతిపక్షానికే పరిమితమైంది.
బీఎస్పీ ఒకచోట, స్వతంత్ర అభ్యర్థి మరో చోట నెగ్గారు. గత ఏడాది మావోయిస్టుల దాడిలో అగ్రనేతలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. సానుభూతి పవనాలపై గంపెడాశలు పెట్టుకుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం తమ ప్రచార సభల్లో నక్సల్ దాడి ఘటననే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓట్లను అభ్యర్థించారు. శాంతిభద్రతలు కాపాడడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రచారం చేశారు. అయితే రాష్ట్ర ప్రజలు ప్రస్తుత సీఎం రమణ్‌సింగ్‌కే జైకొట్టారు. ఒక్క బస్తర్ డివిజన్ మినహా మిగిలిన చోట్ల ఎక్కడా కాంగ్రెస్ సానుభూతి అస్త్రం పనిచేయలేదు. ఈ డివిజన్‌లో మాత్రం బీజేపీపై హస్తం ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. మొత్తం 12 స్థానాల్లో ఎనిమిదింటిలో విజయం సాధించి బీజేపీ ఆధిక్యతను గణనీయంగా తగ్గించింది.
రెండు పార్టీలకు ఓటరు షాక్..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్య నేతలకు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి వరుసగా ఆరేడు సార్లు నెగ్గినవారితోపాటు రమణ్ సర్కారులో పనిచేస్తున్న ఐదుగురు మంత్రులను ఇంటిదారి పట్టించారు. కాంగ్రెస్ ముఖ్య నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఓటమి పాలయ్యారు. సాజా నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలుపొందిన ఈయన ఈసారి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇప్పటికి కాంగ్రెస్ తరఫున ఏడు సార్లు నెగ్గిన గిరిజన నేత రామ్‌పుకార్ సింగ్, మరో గిరిజన నేత బోధ్‌రామ్ కన్వార్ కూడా పరాజయం పాలయ్యారు.
ప్రతాప్‌పూర్ స్థానం నుంచి బరిలోకి దిగిన మరో ముఖ్య నేత ప్రేమ్‌సాయ్ సింగ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌సేవక్ పైక్రా చేతిలో ఓటమిపాలయ్యారు. అవిభాజ్య మధ్యప్రదేశ్ సీఎం శ్యామ్‌చరణ్ శుక్లా తనయుడు అమితేష్ శుక్లా కూడా ఓడి పోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా కుమారుడు అరుణ్ కూడా దుర్గ్ స్థానాన్ని బీజేపీకి సమర్పించుకున్నారు. ముఖ్య నేతలు ఓటమి పాలైనా మాజీ సీఎం అజిత్‌జోగీ తనయుడు అమిత్ జోగీ మాత్రం బీజేపీ అభ్యర్థిపై నెగ్గడం గమనార్హం. బీజేపీ ముఖ్య నేతలు కూడా మట్టికరిచారు. రమణ్‌సింగ్ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న నాన్‌కీ రామ్ కన్వార్, ఇతర మంత్రులు చంద్రశేఖర్ సాహూ, రామ్ విచార్ నేతమ్, లతా ఉసెండీ, హేమ్‌చంద్‌యాదవ్‌లతోపాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నారాయణ్ చందేల్ ఓడారు.
కాంగ్రెస్ దెబ్బతింది ఇలా..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాటలు పెరిగిపోయాయి. సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఎవర్నీ ప్రకటించకపోవడం దెబ్బకొట్టింది. క్యాడర్‌లో ఉత్సాహం నింపాల్సిన నాయకులు జనంలోకి వెళ్లలేదు. దంతేవాడలో జరిగిన నక్సల్స్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ ‘సానుభూతి’ ఓట్లపై ఆశలు పెట్టుకోవడం పార్టీ కొంపముంచింది. పార్టీ సీఎం అభ్యర్థిగా అజిత్‌జోగి పేరు అనధికారికంగా వినిపించినా ఆయనవైపు ప్రజలు మొగ్గుచూపలేదు. గతంలో మూడేళ్లపాటు సీఎంగా పనిచేసిన సమయంలో ఆయన గూండాయిజాన్ని ప్రోత్సహించారని, తమ వారికే కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ గెలిచినా అవే పరిస్థితులు పునరావృతం అవుతాయని బీజేపీ శ్రేణులు కిందిస్థాయిలో చేసిన ప్రచారం కొంతమేర పనిచేసింది.