అమర సైనికుల పిల్లలకు రాందేవ్ స్కూలు
రాందేవ్ బాబా అనగానే ముందుగా మనకు యోగా గుర్తుకొస్తుంది. ఆ తర్వాత వేల కోట్లలో విస్తరించిన ఆయన వ్యాపార సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. కానీ.. ఆయనలోని మరో కోణం ఇప్పుడు వెలుగు చూసింది. అమరులైన సైనికుల పిల్లల కోసం తాను ఈ ఏడాది 'పతంజలి ఆవాసీయ సైనిక్ స్కూల్' ఒకదాన్ని ప్రారంభిస్తానని రాందేవ్ ప్రకటించారు. ఇందులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల పిల్లలకు ఉచితంగా చదువు చెబుతామని అన్నారు. ఢిల్లీ - ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ స్కూలు ఏర్పాటు కానుంది. గురువారం నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో రాందేవ్ బాబా ఈ విషయాన్ని ప్రకటించారు.
ఉన్న ఆస్తిని చారిటీ కోసం ఖర్చు చేయాలన్న లక్ష్యమే పతంజలి బృందాన్ని ముందుకు నడిపిస్తోందని ఆయన తెలిపారు. రాబోయే ఒకటి రెండేళ్లలో పతంజలి దేశంలోనే అతిపెద్ద బ్రాండు అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు లాభాలు సాధించడం మాత్రమే లక్ష్యం కాదని.. నాణ్యమైన, స్వచ్ఛమైన ఉత్పత్తులతో ప్రజలకు సేవ చేయాలన్నదే ధ్యేయమని రాందేవ్ వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో మరణించిన 25 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది పిల్లల చదువులకు అయ్యే ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని ఇటీవలే కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కూడా ప్రకటించాడు.
शहीदों के बच्चों के लिए पतंजलि आवासीय स्कूल की शुरुआत होगी #ProsperityForCharity pic.twitter.com/oQmgsQJoBs
— Swami Ramdev (@yogrishiramdev) 4 May 2017