దెయ్యమై భయపెడుతున్న 'నిర్భయ' దోషి
నిర్భయ కేసు దోషుల్లో ఒకడిగా శిక్ష అనుభవిస్తూ తీహార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డ రాంసింగ్ దెయ్యంగా మారాడు! గతంలో అతడు నివసించిన ఇంట్లో ఆత్మ రూపంలో నివసిస్తూ చుట్టూపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. తన జోలికి వస్తే చిన్నాపెద్దా, ముసలి ముతకా ఎవ్వర్నీ వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నాడు. కట్టుకథను తలపించేలా ఉన్నా ప్రస్తుతం ఢిల్లీలోని సంత్ రవిదాస్ క్యాంప్లోని మురికివాడలో ఎవరినోట విన్నా ఇదే చర్చ!
2012, డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో నిర్భయపై కిరాతకంగా లైంగికదాడికి పాల్పడ్డ ఆరుగురు నిందితుల్లో ఒకడైన రాంసింగ్.. కేసు విచారణ సమయంలోనే తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం నలుగురు దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించగా, బాల నేరస్తుడికి మూడేళ్ల కారాగార శిక్ష పడింది. రాంసింగ్, అతని సోదరుడు ముఖేశ్ లు నేరానికి పాల్పడినప్పటినుంచి అల్లకల్లోలంగా మారిన వారి కుటుంబం.. రాంసింగ్ ఆత్మహత్య తరువాత సొంత ప్రాంతం రాజస్థాన్ కు తరలివెళ్లింది. ఢిల్లీలో వారు నివసించిన ఇల్లు గత రెండేళ్లుగా తాళం వేసి ఖాళీగా ఉంటోంది. ఆ ఇంట్లోనే రాంసింగ్ ఆత్మతిరుగుతోందని, చుట్టుపక్కల వాళ్లు నమ్ముతున్నారు. గల్లీల్లో ఆడుకునే పిల్లలెవ్వర్నీ ఆ ఇంటివైపు వెళ్లొద్దని తల్లులందరూ చెప్తున్నారు. 'రాంసింగ్ దెయ్యంగా మారాడని అందరూ అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా నేను నమ్మినా, నమ్మకున్నా పిల్లల్ని కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి ఆ ఇంటివైపు వెళ్లొద్దని చెప్తున్నాను' అని స్థానిక మహిళ ఒకరు తన అభిప్రాయాన్ని తెలిపారు. బతికున్నప్పుడు కీచకపర్వానికి ఒడిగట్టిన రాంసింగ్.. చనిపోయాక కూడా దెయ్యమై జనానికి కునుకులేకుండా చేస్తున్నాడని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.