
‘రాయల తెలంగాణ’నూ పరిశీలిస్తున్నాం: దిగ్విజయ్‌సింగ్
ఆంటోనీ కమిటీ సంప్రదింపులపై దిగ్విజయ్‌సింగ్ వెల్లడి
విభజన ఏకపక్ష నిర్ణయం కాదన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్
టీడీపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్ సీపీ, బీజేపీ, సీపీఐ సమర్థించాయని వ్యాఖ్య
విభజనపై ‘ఇంతవరకూ వచ్చాక వెనక్కు ఎలా వెళ్తామ’ని ప్రశ్న
కమిటీ పరిశీలనలో ‘హైదరాబాద్ ప్రతిపత్తి’ కూడా ఉందని వెల్లడి
ఏపీఎన్‌జీవోలు సమ్మె విరమించాలంటూ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేసినప్పటికీ.. రాయల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదన కూడా ఆంటోనీ కమిటీ పరిశీలనలో ఉందని ఆ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వెల్లడించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనటం సరికాదన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దిగ్విజయ్ బుధవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడే విధంగా కాకుండా.. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికలకు ముందుగా హడావిడిగా నిర్ణయం తీసుకుందన్న వాదనను ఆయన తిరస్కరించారు.
‘‘తెలంగాణ అంశంపై ఎంతో కాలంగా చర్చలు జరుపుతున్నాం.. అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించాం. దాదాపు అన్ని పార్టీలూ.. టీడీపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, సీపీఐలు తెలంగాణ ఏర్పాటును సమర్థించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందరికంటే చివరిగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నిర్ణయం వెలువడిన తర్వాత ఇతర పార్టీలు తమ అభిప్రాయాలు మార్చుకొంటుంటే మేమేం చేస్తాం?’’ అని చెప్పుకొచ్చారు. అయితే.. సీమాంధ్ర ప్రాంత ప్రజానీకం, ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో కోరుతున్న విధంగా కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని పున ఃపరిశీలించే అవకాశముందా అన్న ప్రశ్నకు.. ‘‘ఇంతవరకూ వచ్చాక వెనక్కు వెళ్లటం ఎలా సాధ్యం?’’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
పరిశీలనలో ‘హైదరాబాద్ ప్రతిపత్తి’ కూడా
విభజన నిర్ణయానంతరం ఎదురుకాగల సమస్యలపై రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలతో రక్షణమంత్రి ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ జరుపుతున్న సంప్రదింపుల్లో.. రాయల తెలంగాణ ఏర్పాటు, హైదరాబాద్ ప్రతిపత్తి వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయని.. వీటన్నింటినీ కమిటీ పరిశీలిస్తోందని దిగ్విజయ్ పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలు లేవనెత్తే అన్ని అంశాలను ఆంటోని కూలంకషంగా పరిశీలిస్తుందని.. జలవనరుల పంపిణీ, ఉపాధి, ఆదాయ వనరుల సమస్యలపై కూడా కమిటీ దృష్టి సారిస్తోందని.. పరిష్కారాలు సూచిస్తుందని చెప్పారు. ఆంటోనీ కమిటీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ అంశాలపై ఒక తుది నిర్ణయం జరుగుతుందన్నారు. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ నిరవధిక సమ్మె చేస్తున్న ఏపీఎన్‌జీవోలు సమ్మె విరమించాలని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకోవద్దని ఆయన విద్యార్థి సంఘాలను కోరారు.