చిన్న మొత్తాలకు ఆర్‌బీఐ షాక్
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు ఆర్‌బీఐ షాకిచ్చింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లోకి పెద్ద ఎత్తున డిపాజిట్ అవుతున్నట్టు తెలియడంతో రిజర్వు బ్యాంకు తాజాగా మరో ఉత్తర్వును జారీ చేసింది. రద్దు చేసిన నోట్లను చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లో జమ చేసుకోరాదని, అలాంటి నోట్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరాదని ఆదేశించింది. ఆ మేరకు బుధవారం రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉన్నపలంగా అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8 నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి రిజర్వు బ్యాంకు ప్రతి రోజూ ఏదో ఒక నిర్ణయం వెల్లడిస్తూనే ఉంది. రద్దు చేసిన నోట్లు చెల్లుబాటు కాకపోవడం, బ్యాంకుల్లో విపరీతమైన రద్దీ నేపథ్యం కావొచ్చు లేదా కొంత మంది తమ సొమ్మును మళ్లించడంవంటి ప్రయత్నాల్లో భాగంగా గడిచిన పక్షం రోజుల్లో అనేక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినప్పుడు ఆ వివరాలను బ్యాంకులు సరిగా నమోదు చేయడం లేదని తెలిసి మంగళవారం అన్ని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రద్దయిన నోట్లను ఎవరైతే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారో వారి బ్యాంకు ఖాతా వివరాలను, డిపాజిట్ చేసిన సొమ్ము మొత్తం వివరాలను విధిగా నమోదు చేయాలని ఆదేశించింది. తాజాగా చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లో రద్దు చేసిన నోట్లను తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది.