ఆర్‌బీఐని బురిడీ కొట్టిస్తూ అక్రమ డిపాజిట్ల దందా
హెచ్‌యూఎఫ్ కర్త, ప్రొప్రైటర్, చైర్మన్ పేర్లతో కనికట్టు
సాక్షి, అమరావతి: ప్రేక్షకులను అలరించేందుకు కథానాయకులు కొన్ని సినిమాల్లో ద్విపాత్రా భినయం... త్రిపాత్రాభినయం చేయటాన్ని చూస్తుంటాం. చట్టం కళ్లకు గంతలు కట్టి ఆర్థిక అక్రమాలకు పాల్పడేందుకు త్రిపాత్రాభినయం చేయడం మాత్రం చెరుకూరి రామోజీరావుకే చెల్లింది. ఆర్‌బీఐ కళ్లుగప్పేందుకు చెరుకూరి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు.
ఆర్‌బీఐను బురిడీ కొట్టించేందుకే...
ఆర్‌బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్‌కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. కాగా రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
అంటే హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. దీనిపై ఆర్‌బీఐగానీ ఇతర దర్యాప్తు సంస్థలుగానీ ప్రశ్నిస్తే తప్పించుకునేందుకు ఆయనో ఎత్తుగడ వేశారు. అదే త్రిపాత్రాభియనం...
సాంకేతిక కారణాలతో తప్పించుకునే ఎత్తుగడ
చెరుకూరి రామోజీరావు అనే వ్యక్తి ఏకకాలంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్ రశీదులపై హెచ్‌యూఎఫ్ కర్తగా... చెక్కులపై ప్రొప్రైటర్‌గా... బోర్డు మీటింగుల మినిట్స్ బుక్‌లో చైర్మన్‌గా సంతకాలు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ.
ఆ సంస్థ ముసుగులో ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించారు మరి. సాంకేతిక కారణాలను సాకుగా చూపించి తప్పించుకునేందుకే రామోజీరావు ఇలా వేర్వేరు హోదాలతో సంతకాలు చేశారన్నది సుస్పష్టం. కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు మినహా ఇతరులు ఇంత పక్కాగా మోసగించలేరని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
డిపాజిట్ పత్రాలపై హెచ్‌యూఎఫ్ కర్తగా...
మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విలువ మేరకు తమ డిపాజిట్‌దారులకు పత్రాలను జారీ చేసింది. వాటిపై రామోజీరావు తనను తాను ‘హెచ్‌యూ ఎఫ్ కర్త’గా పేర్కొంటూ సంతకం చేశారు.
బోర్డు మీటింగులో చైర్మన్‌గా...
ఇక మార్గదర్శి ఫైనాన్సియర్స్ బోర్డు మీటింగుల విషయం వచ్చేసరికి రామోజీరావు మరో పాత్రలోకి ప్రవేశించారు. బోర్డు మీటింగు మినిట్స్ బుక్‌లో, తీర్మానాల్లోనూ ఆయన ‘చైర్మన్’ అని సంతకం చేశారు.
చెక్కులపై ప్రొప్రైటర్‌గా...
మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిట్‌దా రులకు కాలపరిమితి తరువాత చెక్కుల రూపంలో చెల్లింపులు చేసింది. ఆమేరకు జారీ చేసిన చెక్కులపై రామోజీరావు ‘ప్రొప్రైటర్’ అని పేర్కొంటూ సంతకం చేశారు. అంటే డిపాజిట్ రశీదు మీద హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు చెక్కు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రొప్రైటర్ అయిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment