ఎంతో చెప్పరా? | RBI Silent on Bank Deposits in Currency Demonetization period | Sakshi
Sakshi News home page

ఎంతో చెప్పరా?

Published Wed, Jan 4 2017 3:03 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

ఎంతో చెప్పరా? - Sakshi

ఎంతో చెప్పరా?

ఆర్‌బీఐ మౌనం

డిసెంబరు 30 గడువు ముగిసేనాటికి బ్యాంకుల్లోకి తిరిగి రాకుండా ఉండిపోయిన మొత్తమెంతో రిజర్వు బ్యాంకు వెల్లడించలేదు. 31న ప్రధాని మోదీ సైతం తన ప్రసంగంలో ఎక్కడా దీని ఊసెత్తలేదు. చెల్లకుండా పోయినా 15.44 లక్షల కోట్ల పాత పెద్ద నోట్లలో బ్యాంకుల్లోకి తిరిగి వచ్చిందెంత? రాకుండా ఉండిపోయిన నల్లధనమెంత? వివిధ సందర్భాల్లో ఆర్‌బీఐ, ఆర్థికశాఖ అధికారులు
చెప్పిన లెక్కలు, ఆర్థిక రంగ నిపుణులు, వార్తా సంస్థల అంచనాల ప్రకారం ఈ గణాంకాలపై దృష్టి సారిస్తే...


నవంబరు 8 నాటికి పెద్దనోట్ల రూపంలో చలామణిలో ఉన్న 15.44 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత మొత్తం బ్యాంకుల్లోకి డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చిందనేది ఆర్‌బీఐ చెప్పడం లేదు. పాతనోట్లను డిపాజిట్‌ చేసే గడువు డిసెంబరు 30నే ముగిసింది. నగదు అందుబాటులో లేక 50 రోజుల పాటు జనం తీవ్ర అవస్థలు పడ్డారు. బ్యాంకుల్లోకి తిరిగి రాకుండా ఉన్న మొత్తమెంత? ఎంత నల్లధనం వృధా అయిందనేది తెలుసుకునే హక్కు వీరికి లేదా? (డిసెంబరు 10న ఇచ్చిన అధికారిక సమాచారం మేరకు ఇంకా 20 రోజులు గడువు ఉండగానే 12.44 లక్షల కోట్లు తిరిగి వచ్చేసింది.) బ్యాంకు లావాదేవీలు, చెల్లింపులకు, కార్డుల ద్వారా కొనుగోళ్లు... తదితర డాటా ఆర్‌బీఐకి ఎప్పటికప్పుడు చేరుతుంది. బ్యాంకులు ఏ రోజుకారోజు ఈ సమాచారాన్ని ఆర్‌బీఐకి చేరవేస్తాయి. మరి ఆర్‌బీఐ ఎందుకు ఈ వివరాలు వెల్లడించడం లేదు. ఎందుకీ గోప్యత? బ్యాంకుల్లోకి రాకుండా ఉండిపోయిన మొత్తం తక్కు వగా ఉంటే పరువు పోతుందనా?


2.53 లక్షల కోట్లు
వంద అంతకంటే చిన్న నోట్ల రూపంలో చలామణిలో ఉన్న నగదు.

5  లక్షల కోట్లు
రద్దయిన పెద్దనోట్లలో... బ్యాంకుల్లోకి తిరిగి రాకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన మొత్తం.
ప్రజల వద్ద చలామణిలో ఉన్న డబ్బు, బ్యాంకుల్లోని నగదును కలిపి...రిజర్వు మనీ డాటా పేరిట ఆర్‌బీఐ ప్రతివారం భారత్‌లో చలామణిలో ఉన్న మొత్తం డబ్బుకు (సీఐసీ– కరెన్సీ ఇన్‌ సర్క్యులేషన్‌) సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తుంది.

9.42  లక్షల కోట్లు
ఆర్‌బీఐ ఇచ్చిన సీఐసీ గణాంకాల ప్రకారం డిసెంబరు 23 నాటికి చలామణిలో ఉన్న నగదు. ఇందులోంచి చిన్ననోట్ల రూపంలో ఉన్న 2.53 లక్షల కోట్లను తీసివేస్తే... కొత్తనోట్ల రూపంలో ఆర్‌బీఐ జారీచేసిన మొత్తం 6.89 కోట్లు. అంటే ఉపసంహరించిన నోట్ల స్థానంలో ఆర్‌బీఐ 45 శాతానికంటే తక్కువ నోట్లను తిరిగి జనానికి అందుబాటులోకి తెచ్చింది.

8.55  లక్షల కోట్లు
డిసెంబరు 23 నాటికి ఇంకా ఆర్‌బీఐ జారీచేయాల్సిన కొత్తనోట్లు. (ఇందులో నుంచి బ్యాంకుల్లోకి తిరిగి రాని మొత్తాన్ని తీసివేయాలి. ఇది ఎంతనేది ఆర్‌బీఐ గానీ, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖగానీ వెల్లడించడం లేదు).

14.9  లక్షల కోట్లు
పాత నోట్లను డిపాజిట్‌ చేసే గడువు... డిసెంబరు 30వ తేదీ ముగిసేనాటికి 14.9 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోని తిరిగి వచ్చిందని వార్తా సంస్థ (ప్రజలు బ్యాంకు కౌంటర్ల దగ్గర మార్పిడి చేసుకున్న మొత్తం కూడా కలిపితే) ఐఏఎన్‌ఎస్‌ అంచనా.  దీని ప్రకారం తిరిగిరాని మొత్తం 54 వేల కోట్ల రూపాయలుగా తేలుతుంది. మొత్తం రద్దుచేసిన కరెన్సీలో ఇది 3.5 శాతం మాత్రమే. ఇందులో ఎన్‌ఆర్‌ఐల వద్ద ఉండిపోయిన భారత కరెన్సీ కూడా కలిపి ఉంటుంది. జేఎన్‌యూ ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌ సురజిత్‌ మజుందార్‌ అంచనా కూడా తిరిగిరాని మొత్తం లక్ష కోట్లే లోపే ఉంటుందని. ఒకవేళ ఇది లక్ష కోట్లున్నా మొత్తం రద్దు చేసిన కరెన్సీ విలువలో ఇది 6.5 శాతమే.

1.5  లక్షల కోట్లు
పాత పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం ఆర్థిక కార్యకలాపాలు మందగించడం... అసంఘటిత రంగంలో ఉద్యోగాలు పోవడం తదితర పరిణామాల మూలంగా... భారత స్థూల దేశీయోత్పత్తిపై లక్షన్నర కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ది ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా. దీనికి కొత్తనోట్ల ముద్రణ, రవాణా, పంపిణీ ఖర్చులు అదనం.


4,663  కోట్లు
నవంబరు 8 నుంచి జనవరి ఒకటో తేదీ దాకా ఆదాయపు పన్ను శాఖ పట్టుకున్న వెల్లడించని ఆదాయం 4,663 కోట్ల రూపాయలు. ఈ కాలంలో దేశవ్యాప్తం 253 చోట్ల ఐటీ దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేతకు సంబంధించి 5,062 నోటీసులు జారీచేసింది.

రోజుకు 1,000 కోట్లు
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. భీమ్‌ యాప్‌ను కూడా తెచ్చింది. నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్‌ 8న దేశంలో జరిగిన నగదు రహిత లావాదేవీలను డిసెంబర్‌ 26న జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా రోజుకు వెయ్యి కోట్ల రూపాయల ఈ ట్రాన్షాక్షన్‌ పెరిగాయి. నగదు రహిత లావాదేవీలకు సంబంధించి... డిసెంబర్‌ నెలలో రోజువారీ డాటాను ఆర్‌బీఐ విడుదల చేస్తోంది. దాని ప్రకారం...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement