ఇరకాటంలో అశోక్‌గజపతి రాజు!
న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గొడవ వ్యవహారంలో పౌర విమాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు దొరికిపోయారు. గొడవ జరినప్పుడు ఆయన అక్కడే ఉన్నారని వెల్లడైంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై రిపబ్లిక్ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం బహిర్గతమైంది.
ఘటన జరిగిన రోజు అశోక్ గజపతిరాజు.. విమానాశ్రయంలోనే ఉన్నారని, ఆయనే మేనేజర్‌ను పిలిచి తనకు బోర్డింగ్ పాస్ ఇప్పించారని స్టింగ్ ఆపరేషన్‌లో దివాకర్‌రెడ్డి వెల్లడించారు. ‘ఆయన స్టేషన్ మేనేజర్‌ను పిలిచారు. రెడ్డి ఏది అడుగుతున్నారో అది ఇవ్వండ’ని మంత్రి ఆదేశించినట్టు తెలిపారు. ఆ రోజు అదే విమానంలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో అశోక్ గజపతిరాజు ఇరకాటంలో పడ్డారు. జేసీ గొడవతో తనకు సంబంధం లేదని గతంలో మంత్రి చెప్పారు. అయితే ఈ ఘటనపై అశోక్ గజపతిరాజు విచారణకు ఆదేశించడంపై జేసీని ప్రశ్నించగా... ‘ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన అధికారి. ఆయన రాజకీయ నేతగా పనిచేయడం లేదు. అధికారిలా ఆయన పనిచేస్తున్నార’ని సమాధానమిచ్చారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై దౌర్జన్యం చేసిన మాట వాస్తమేనని దివాకర్‌రెడ్డి ఒప్పుకున్నారు. ‘నేను హడావుడిలో ఉన్నాను. రెండు మూడుసార్లు బతిమాలినా నాకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో భావోద్వేగానికి గురయ్యాను. అక్కడున్న ప్రింటర్‌ను పక్కకు తోసేయ్యాలనుకున్నాను. కానీ నావల్ల కాలేదు. నేను ఎవరికీ క్షమాపణ చెప్పను. నేనెందుకు క్షమాపణ చెప్పాలి. నేనూ మనిషినే. ప్రయాణం హడావుడిలో ఈ ఘటన చోటుచేసుకుంద’ని జేసీ పేర్కొన్నారు. కాగా, ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై దివాకర్‌రెడ్డి దౌర్జన్యం చేసిన వీడియో దృశ్యాలను కూడా రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ మేనేజర్‌ను వెనుక నుంచి జేసీ నెట్టేస్తున్న దృశ్యం ఇందులో ఉంది. అయితే ఫ్రెండ్లీగానే ఆయన భుజాలపై చేతులు వేశానని, నెట్టలేదని ఆయన సమర్థించుకున్నారు.
ఈ నెల 15న విశాఖ ఎయిర్‌పోర్టులో దివాకర్‌రెడ్డి వీరంగం సృష్టించారు. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై జులుం ప్రదర్శించారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా, స్పైస్‌జెట్, జెట్‌ఎయిర్‌వేస్ సహా పలు సంస్థలు ఆయనపై నిషేధం విధించాయి.