న్యూఢిల్లీ: జాట్ వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చుతూ గత యూపీఏ సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. రిజర్వేషన్ కల్పించేందుకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. జాట్లను ఓబీసీల జాబితాలో చేర్చాల్సిన అవసరం లేదని వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్(ఎన్‌సీబీసీ) చేసిన సిఫార్సునూ కేంద్రం పట్టించుకోలేదని వేలెత్తిచూపింది. గత ఏడాది మార్చిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం 9 రాష్ట్రాల్లో జాట్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ జరిపింది.
కులం ముఖ్య ప్రాతిపదికే అయినా సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు దాన్నే పరిగణనలోకి తీసుకోరాదన్న మండల్ కమిషన్ సిఫార్సును ఉటంకించింది. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాల వల్ల ఇతర వెనుకబడిన వర్గాలకు నష్టం జరుగుతుందంది. దీనిపై నోటీసులు అందుకున్న ప్రస్తుత ఎన్డీఏ సర్కారు.. జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చడాన్ని సమర్థించుకుంది.