సాగు, తాగునీరు కోసం ఎక్కడబడితే అక్కడ బోరు బావులు తవ్వడం ఇక కుదరదు. బోర్లకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా బోర్లు వేసే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి వేలుమణి ముసాయిదాను ప్రవేశపెట్టారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఎండిపోతున్న పంటను కాపాడుకోవాలనే ఆతృతలో రైతన్నలు తమ వ్యవసాయ భూములో బోర్లు తవ్వడం పరిపాటి. నిబంధనల ప్రకారం, భూగర్భ జలశాఖ ద్వారా ముందుగా సర్వే చేయించి, నీళ్లు ఎక్కడపడతాయో తెలుసుకుని తరువాత బోరుబావులను తవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులోని జాప్యాన్ని, అధికారుల ఖర్చును భరించే స్తోమత లేని రైతులు తమకున్న అరకొర పరిజ్ఞానాన్ని వినియోగించి బోర్లు తవ్వేస్తారు. నీరు పడని పక్షంలో పలు చోట్ల తవ్వుకుంటూ పోతారు. అయితే నీళ్లుపడని బోర్లను అలాగే వదిలేస్తుంటారు.
ఈ బారుబావుల్లో చిన్నారులు జారి పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. బోరులో పడిన చిన్నారిని రక్షించేందుకు వివిధ శాఖల అధికారులు లక్షలాది రూపాయలను వెచ్చించి రాత్రింబవళ్లూ శ్రమించాల్సి వస్తోంది. అనేక సార్లు శ్రమ వృథాగా మారి తల్లిదండ్రులకు కడుపుకోతనే మిగులుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా ప్రజల్లో మాత్రం చైతన్యం రాకపోవడంతో సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
అనుమతి మీరితే జైలే
చర్యలు చేపడితే గానీ ప్రజల్లో మార్పురాదని ప్రభుత్వం భావిస్తోంది. బోరు ప్రమాదాలు జరిగినపుడల్లా ప్రభుత్వం అనేక హెచ్చరికలు చేస్తోంది. ఖాళీ బోర్లు ఎక్కడ కనపడినా పూడ్చివేయాలని, తవ్వకం పనులు జరుగుతున్న సమయంలో బోరు రంధ్రాలకు గట్టిమూతలు వేయాలని, చిన్నారులను ఒంటరిగా వదలరాదని ఇలా సామధాన, భేద పద్దతుల్లో అనేక జాగ్రత్తలు చెబుతూనే ఉంది. ఇక దండోపాయమే మిగిలిందన్నట్లుగా అసెంబ్లీలో ముసాయిదాను ప్రవేశపెట్టింది.
సాగు, తాగునీటి వనరుల కోసం బోర్లు, బావులు తవ్వాలంటే ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత అధికారులు సర్వే చేసి తగిన స్థలాన్ని నిర్ణయిస్తారు. పనులు జరుగుతున్న సమయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. దురదృష్టవశాత్తు నీళ్లుపడని పక్షంలో ఆ బోరును వెంటనే పూడ్చివేస్తారు. అనుమతి పొందకుండా తవ్వకాలకు పాల్పడితే ఐపీసీ 143 ఏ లేదా ఐపీసీ 143 బీ సెక్షన్ల కింద కేసులు బనాయించి కనిష్టం 3 ఏళ్లు, గరిష్టం 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా చెల్లించాలని చట్టం తెస్తున్నారు.
బోర్లపై ఆంక్షలు
Published Tue, Aug 12 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement