రెబల్స్ చేతిలో ఫలితం
ఉత్తరాఖండ్ ఎన్నికల ముఖచిత్రం
► కాంగ్రెస్, బీజేపీలకు రెబల్ అభ్యర్థుల సెగ
► కమలానికి 16 స్థానాల్లో, హస్తానికి 12 స్థానాల్లో చిక్కు
చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు రెబల్ అభ్యర్థుల నుంచి పెద్ద చిక్కు ఎదుర్కొంటున్నాయి. 16 ఏళ్ల చరిత్రలో 8 మంది సీఎంలను చూసిన ఈ రాష్ట్రంలో తాజా ఫలితాన్ని రెబల్ అభ్యర్థులే నిర్ణయించే స్థాయిలో రాజకీయాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలుం డగా, కర్ణప్రయాగ్ కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కన్వాసీ చనిపోవడంతో 69 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్న బీజేపీ 16 స్థానాల్లో, కాంగ్రెస్ 12 స్థానాల్లో రెబల్ అభ్యర్థులను ఎదుర్కొంటున్నాయి. పార్టీ అభ్యర్థులను ఓడించడానికి రెబల్స్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. బుధవారం జరిగే ఎన్నికల్లో దాదాపు 74 లక్షల మంది ఓటర్లు.. 628 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
బీజేపీకి కీలకం: ప్రస్తుత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ఎన్నికలు బీజేపీకి, ప్రధాని మోదీకి కీలకంగా మారాయి. గోవా, మణిపూర్ చిన్న రాష్ట్రాలు. పంజాబ్‌లో అకాలీ–బీజేపీ కూట మి గెలుస్తుందనే ఆశల్లేవు. యూపీ ఫలితం కూడా అనిశ్చితమే. దీంతో బీజేపీని ఒక్క ఉత్తరాఖండే అదుకోవాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కమలదళ సారథి అమిత్ షా, మోదీ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం హరీశ్ రావత్ కూడా దీటుగా తలపడుతున్నారు. ప్రధాని ఇప్పటివరకు ఐదు సభల్లో, రాహుల్ మూడు సభల్లో మాట్లాడారు.
బయటివారికిచ్చి..
కాంగ్రెస్‌తో సమానంగా స్వపక్ష రెబల్స్‌తోనూ పోరాడాల్సిన అగత్యాన్ని బీజేపీ ఎదుర్కోంటోంది. రావత్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమిత్ షా చేసిన యత్నం బెడిసికొట్టడమే దీనికి కారణం. అమిత్ షా యత్నం వల్ల 12 మంది కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇటీవల పార్టీ ఫిరాయించారు. వారిని బీజేపీలో చేర్చుకోవాలని అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు చెప్పగా వారు తిరస్కరించారు. అయినా షా వెనక్కి తగ్గకుండా వారందర్నీ పార్టీలో చేర్చుకున్నారు. వారికి, కాంగ్రెస్ నుంచి వచ్చిన మరికొందరికి టిక్కెట్లివ్వాల్సి రావడంతో నలుగురు బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేకపోయారు. దీనికి తోడు ఇతర కారణాల వల్ల మొత్తం 16 స్థానాల్లో కాషాయదళంపై రెబల్స్ బరిలోకి దిగారు.
కాంగ్రెస్‌లో..: ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను, బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న రావత్ రెబల్ అభ్యర్థులతోనూ గట్టిగా తలపడుతున్నారు. అయితే బీజేపీతో పోలిస్తే రెబల్స్ సెగ కాంగ్రెస్‌కు తక్కువేనని చెప్పొచ్చు. ప్రచారాన్నంతా నెత్తి న వేసుకుని నడిపిస్తున్న రావత్ కాంగ్రెస్ గెలి చినా, ఓడినా అందుకు బాధ్యుడవుతారు.
అగ్రవర్ణాల అధిపత్యం
రాష్ట్ర జనాభాలో మాదిరే రాజకీయాల్లోనూ అగ్రవర్ణాల ప్రాబల్యం కొనసాగుతోంది. జనాభాలో 64 శాతం అగ్రవర్ణ ఠాకూర్లు, బ్రాహ్మణులే. ముస్లింలు 14 శాతం ఉండగా దళితుల జనాభా 16 శాతం.
జవాన్ల రాష్ట్రం: రాష్ట్రంలో ప్రతి ఐదిళ్లలో ఒక ఇంటి నుంచి ఒకరు సైన్యంలో పనిచేస్తున్నారు. ఆర్మీలో 90 వేలు, పారామిలటరీలో 1.25 లక్షల మంది ఉత్తరాఖండ్ వారు న్నారు. దీంతో పార్టీల కన్ను వీరి కుటుం బాలపై పడింది. సైనికులకు ఒక ర్యాంకు–ఒక పింఛను(ఓఆర్‌ఓపీ) విధానాన్ని అమలు చేసిన ఘనత తమదేనని బీజేపీ నేతలు అన్ని సభల్లోనూ ప్రస్తావిస్తున్నారు.
హోరాహోరీ పోరు
హోరాహోరీ ఎన్నికలకు చిరునామా అయిన ఉత్తరాఖండ్‌లో తాజా ఎన్నికల్లోనూ గట్టి పోటీ నెలకొంది. 16 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీగానీ, స్థిరమైన అధికారం గానీ దక్కలేదు. ఎన్డీ తివారీ మాత్రమే సీఎంగా ఐదేళ్ల పదవీ కాలాన్ని (2002–2007) పూర్తి చేసుకున్నారు. 2012 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 32, బీజేపీకి 31 సీట్లు దక్కాయి. రెండు పార్టీలకు 31.13 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల సంఖ్యలో చెప్పాలంటే.. బీజేపీకంటే కాంగ్రెస్ కేవలం 27వేల ఓట్లను మాత్రమే ఎక్కువగా గెలుచుకుంది. 2007 ఎన్నికల్లో బీజేపీకి 31.6%, కాంగ్రెస్‌కు 29.9% ఓట్లు వచ్చాయి.
- డెహ్రాడూన్ నుంచి కె. రామచంద్రమూర్తి