
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ (86) కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన 1956 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి కృష్ణన్.. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన అఖిల భారత సర్వీసు అధికారిగా అందరి మన్ననలు పొందారు. మండల్ కమిషన్ సిఫార్సుల్లో ఆయన ముఖ్యభూమిక పోషించారు.
వైఎస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలో కృష్ణన్‌ది ప్రముఖపాత్ర. కేంద్ర సంక్షేమ శాఖ కార్యదర్శిగా, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ సభ్య కార్యదర్శిగా, ప్లానింగ్ కమిషన్‌లోని వివిధ విభాగాల్లో చైర్మన్, సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989, సవరణ చట్టం–2015, సవరణ చట్టం–2018 డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వ గౌరవ సలహాదారుడిగా పనిచేశారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన కృష్ణన్ మృతి పట్ల భవన్ ఉద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పీఎస్ కృష్ణన్‌కు భార్య శాంతి, కుమార్తె శుభా, అల్లుడు చంద్రశేఖర్ ఉన్నారు. కృష్ణన్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, బృందా కారత్, ఎన్‌సీడీహెచ్చార్ ప్రధాన కార్యదర్శి పాల్ దివాకర్, ఏపీ భవన్ ఇన్‌చార్జ్ ఆర్సీ భావనా సక్సేనా, ఏఐడీఆర్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు కందుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం వైఎస్ జగన్ సంతాపం
పీఎస్ కృష్ణన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణన్ జీవితాన్ని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అంకితం చేశారని కీర్తించారు. అట్టడుగు వర్గాలకు అండగా నిలబడ్డ వ్యక్తిగా ఆయన గుర్తుండి పోతారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.