రిక్షావాలాలు, డ్రైవర్లు.. ఆ కంపెనీలకు డైరెక్టర్లు!
న్యూఢిల్లీ: నలభై ఏళ్ల రసూల్ (పేరు మార్చాం) ఉత్తర ఢిల్లీలో తోపుడు బండి మీద కూరగాయాలు అమ్ముకుంటాడు. గత ఏడాది ఉన్నట్టుండి ఓ రోజు అతను తనకు కూడా తెలియకుండానే ఓ కంపెనీకి డైరెక్టర్ అయ్యాడు. ఇందుకు నెలకు రూ. పదివేల పారితోషికం కూడా అందుకున్నాడు. రసూలే కాదు మురికివాడల్లో నివసించే దాదాపు 59 మంది ఇలా రాత్రికి రాత్రి డైరెక్టర్లు అయిపోయారు. రిక్షా కార్మికులు, చిరు వ్యాపారులు, డ్రైవర్లు, ఇంటి పనిమనిషులూ.. ఇలాంటి నిరుపేదలే 59 బూటకపు కంపెనీల్లో పేరుకుమాత్రం డైరెక్టర్లుగా నమోదయ్యారు.
రూ. 6,172 కోట్ల బ్యాంక్ ఆఫ్ బరోడా మనీ లాండరింగ్ కుంభకోణంలో జరిగిన గోల్‌మాల్ ఇది. దేశంలోనే అతిపెద్ద 'బ్యాంకింగ్-హవాలా' కుంభకోణమైన ఈ వ్యవహారంలో నిరుపేదల పేర్లను డైరెక్టర్లుగా వాడుకొని వేలకోట్ల రూపాయల నల్లడబ్బును విదేశాలకు ఎలా మనీలాండరింగ్ చేశారో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ కుంభకోణంలో దర్యాప్తు ముందుకు సాగుతున్నకొద్దీ దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. తక్కువ ఆదాయ వర్గం ప్రజలను ఎగుమతి/దిగుమతిదారులుగా వాడుకుంటూ అక్రమంగా సంపాదించిన సొమ్మును పెద్ద ఎత్తున విదేశాలకు తరలిస్తున్న వైనం దర్యాప్తులో బహిర్గతమైంది.
ఈ భారీ హవాలా కుంభకోణం గత ఏడాది మేలో ప్రారంభమైంది. వ్యాపారవేత్తలు గురుచరణ్‌సింగ్, చందన్ భాటియా, సంజయ్ అగర్వాల్ తదితర వ్యాపారవేత్తలు, తెరవెనుక ఉన్న మరికొందరు సూత్రధారులు హాంకాంగ్, దుబాయ్ దేశాలకు నల్లడబ్బును తరలించారు. ఢిల్లీలోని అశోక్ విహార్ బ్రాంచ్‌లోని ఇద్దరు సీనియర్ అధికారులైన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్కే గార్గ్, ఫారెన్ ఎక్స్చేంజ్ డివిజన్ హెడ్ జైనిష్ దూబేలను ఒప్పించడం ద్వారా ఈ భారీ కుంభకోణానికి వారు పాల్పడ్డారని సీబీఐ వర్గాలు తెలిపాయి.
డ్రైవర్లు, చిరువ్యాపారులు తదితరులను నెలకు రూ. పదివేలు పారితోషికం ఇస్తామని ఒప్పించి.. వారి ఓటర్ ఐడీ కార్డులను సేకరించారని, పేదవారు కావడంతో తమకేమీ తెలియకపోయినా.. డబ్బు కోసం తమ చిరునామా పత్రాలను వారికి ఇచ్చారని దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. వారి ఓటర్ కార్డులు సేకరించి.. వాటి ద్వారా పాన్ కార్డులను తీసుకొని.. బూకటపు కంపెనీల్లో వారు డైరెక్టర్లుగా పేర్కొంటూ బాంక్ ఆఫ్ బరోడాలో కరెంటు ఖాతాలు తెరిచారని ఆయన వివరించారు.
నకిలీ చిరునామాలతో చాలా కంపెనీలను సృష్టించి.. అందులో వారిని డైరెక్టర్లు, భాగస్వాములుగా పేర్కొంటూ ఈ అత్యంత పకడ్బందీగా ఈ స్కాం చేశారని ఆయన వివరించారు. ఈ కంపెనీల ద్వారా డ్రై ఫ్రూట్స్, పప్పుధాన్యాలు, బియ్యం దిగుమతి చేశారని పేర్కొన్నారని, నిజానికి అలాంటి దిగుమతులేవి జరుగలేదని సీబీఐ వర్గాలు చెప్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన సొమ్ముగా పేర్కొంటూ 2014 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు బ్యాక్ ఆఫ్ బరోడా బ్యాంకులో రూ. 6,172 కోట్లు డిపాజిట్ చేశారని, మరో బ్యాంకు నుంచి ఈ బ్యాంకులోకి డబ్బు డిపాజిట్ అయిన మార్గం కూడా అక్రమంగానే జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి.