పాట్న: ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పుట్టినరోజు వేడుకను విలాసవంతంగా జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా..తేజస్వీ యాదవ్ ఈ నెల 9న తన 30వ పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకమైన చార్టర్డ్ విమానంలో జరుపుకున్నారు. బర్త్‌డే సెలబ్రేషన్ ఫోటోలను రాంచీలోని రాక్ గార్డెన్ రిసార్ట్ డైరెక్టర్ సిద్ధాంత్ సుమన్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతోపాటు తేజస్వీ యాదవ్ ఫేస్‌బుక్ ఖాతాకు ట్యాగ్ చేశారు.
ఈ ఫోటోల్లో తేజస్వీ బర్త్‌డే కేకును కట్ చేస్తున్నవి, సిద్ధాంత్‌తో కలిసి అల్పాహారం తింటున్నవి, కట్ చేసిన కేకును సిద్ధాంత్‌కు తినిపిస్తున్నవి ఉన్నాయి. తేజస్వీతో పాటు ఆర్జేడీ ఎమ్మెల్యే భోలా యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, మణి యాదవ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తేజస్వీ యాదవ్‌ను పలువురు నేతలు విమర్శలు గుప్పించారు.
జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతి గురించి మాట్లాడే.. తేజస్వీ యాదవ్ విలాసవంతంగా చార్టర్డ్ విమానంలో పుట్టినరోజు జరుపుకున్నారు. అలా విమానాల్లో వేడుకలు జరుపుకోవడానికి బిల్లులు ఎవరు చెల్లించారని దుయ్యబట్టారు. కేక్ అందిస్తున్న సిద్ధాంత్ సుమన్ ఎవరని ప్రశ్నించారు. ఆర్జేడీ నేతలు పేదలు, అణచివేతకు గురైన వారిపట్ల మొసలి కన్నీళ్లు పెట్టుకుంటారని ఆయన ఆరోపించారు. ఎప్పుడూ పేదల నుంచి భూమిని లాక్కుని, అవినీతి కేసులకు పాల్పడుతారని విమర్శించారు.
ఓ వైపు తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బాగాలేదనే ఆందోళన కొంచం కూడా లేకుండా తేజస్వీ యాదవ్ తన పుట్టినరోజు వేడుకలు ఆకాశంలో జరుగుపుకోవడానికి సిగ్గుచేటు అని సంజయ్‌సింగ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రజా జీవితంలో ఇలాంటి విపరీత జీవనశైలిని నివారించాలని, ఈ సంఘటన పార్టీకి సమస్యలు కలిగించిందని కొందరు ఆర్జేడీ నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే తేజస్వీ యాదవ్ మాత్రం ఇప్పటివరకూ ఈ వివాదంపై పెదవి విప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment