న్యూఢిల్లీ : ‘నా కుమారుడు హత్య గావించబడ్డాడని తెలియగానే షాక్‌కు గురయ్యాను. ఇప్పుడు నాకు తీరని శోకం మాత్రమే మిగిలింది. ఆరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు రోహిత్ నిద్రలేవక పోవడం ఈ పరిస్థితికి దారితీస్తుందని ఊహించలేకపోయాను’ అని రోహిత్ శేఖర్ తివారి తల్లి ఉజ్వల తివారి భావోద్వేగానికి లోనయ్యారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, దివంగత నేత ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ తివారి గత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ఢిల్లీ పోలీసులు రోహిత్‌ది హత్యేననే నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా కేసు నమోదు చేశారు. రోహిత్ శేఖర్‌ది సహజ మరణం కాదని, ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడైందని వచ్చిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి ఉజ్వల తివారి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడి జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. రోహిత్, తన భార్య అపూర్వ మధ్య అంతగా సఖ్యత లేదని.. పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా తనకు తగినంత గుర్తింపు దక్కలేదని రోహిత్ ఎల్లప్పుడూ ఆవేదన చెందేవాడని తెలిపారు. ‘ ఏప్రిల్ 11న ఓటు వేయడానికి మేమిద్దం హల్‌ద్వాని(ఉత్తరాఖండ్) వెళ్లాం. మరుసటిరోజే ఢిల్లీకి తిరిగి రావాలనుకున్నాం. కానీ శేఖర్ తన మనసు మార్చుకున్నాడు. తన వాళ్లను కలుసుకోవాలని నాతో చెప్పాడు. రాజకీయాల్లో అంతగా అనుభవంలేని వాళ్లు కూడా టికెట్లు పొందుతున్నారు. నేను మాత్రం నాన్న వారసత్వాన్ని కొనసాగించలేకపోతున్నానని ఆవేదన చెందాడు. రాణీభాగ్‌లోని తండ్రి సమాధి వద్దకు వెళ్లాడు. అక్కడే ఓ రిసార్టులో ఆరోజు బస చేశాం. అనంతరం నీమ్ కరోలీ బాబా దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నాం’ అని ఉజ్వల చెప్పుకొచ్చారు.
చదవండి : ఎన్డీ తివారీ కుమారుడి మృతి కేసులో కొత్తమలుపు
అపూర్వను గుడ్డిగా నమ్మాను..
‘ఏప్రిల్ 15న ఢిల్లీకి తిరిగి వచ్చాము. శేఖర్ డిఫెన్స్ కాలనీలోని ఇంటికి వెళ్లగా.. నేను తిలక్ లైన్‌లో ఆస్పత్రికి వెళ్లాను. తిరిగి వచ్చిన తర్వాత రోహిత్ గురించి అపూర్వను అడిగాను. బాగా అలసిపోయాడు కాబట్టి నిద్రపోతున్నాడని చెప్పింది. నా బొటనవ్రేలుకు గాయం కావడంతో 11. 30 గంటలకు తిలక్ నగర్‌కు వెళ్లాను. మ్యాక్స్ ఆస్పత్రిలో అపాయింట్‌మెంట్ తీసుకున్నాను అని అపూర్వకు చెప్పి.. రోహిత్ ఎక్కడని అడిగాను. తను నిద్ర పోతున్నాడు. డిస్ట్రర్బ్ చేయొద్దని చెప్పింది. నేను అపూర్వను గుడ్డిగా నమ్మాను. అందుకే ఇంతసేపటి దాకా రోహిత్ నిద్రపోవడమేమిటని అడగలేకపోయాను’ అని ఉజ్వల తివారి ఉద్వేగానికి లోనయ్యారు.
మొదటి నుంచి గొడవలే..
రోహిత్ పెళ్లి గురించి చెబుతూ.. ‘రోహిత్, అపూర్వ ఏడాది కాలం పాటు ప్రేమించుకుని విడిపోయారు. జనవరి 2018 నుంచి మార్చి వరకు అసలు టచ్‌లో కూడా లేరు. కానీ ఏప్రిల్ 2న నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటామని చెప్పారు. సరేనన్నాను. కానీ ఇప్పుడిలా జరిగింది’ అని ఉజ్వల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అపూర్వ తండ్రి మాట్లాడుతూ.. ‘ నా కూతురు ఇలాంటి దారుణానికి ఒడిగట్టే అవకాశమే లేదు. అల్లుడు చనిపోయాడని తెలియగానే ఇక్కడకు వచ్చేశాం. పోలీసు విచారణ తర్వాతే నిజానిజాలు బయటకు వస్తాయి అని తెలిపారు. కాగా రోహిత్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా అతడి కుటుంబ సభ్యులతో పాటు స్టాఫ్‌ను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక వృత్తిరీత్యా న్యాయవాది అయిన శేఖర్ తివారీ ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు 2015-2017 మధ్య సలహాదారుగా పనిచేశారు. రోహిత్ శేఖర్ తివారీ తండ్రి నారాయణ్ దత్ తివారీ గత ఏడాది అక్టోబర్‌లో మరణించిన సంగతి తెల్సిందే. మొదట రోహిత్ శేఖర్ తన కుమారుడు కాదని ఎన్‌డీ తివారీ వాదించిన సంగతి అప్పట్లో సంచలనమే సృష్టించింది. దీంతో రోహిత్ శేఖర్ కోర్టుకు వెళ్లడంతో కోర్టు డీఎన్‌ఏ టెస్టుకు వెళ్లాలని సూచించింది. ఎట్టకేలకు 2014లో రోహిత్ శేఖర్ తన కుమారుడేనని ఎన్‌డీ తివారీ ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది. ఆ తర్వాత ఎన్‌డీ తివారీ, రోహిత్ శేఖర్ తల్లి ఉజ్జ్వలను వివాహమాడారు.
Comments
Please login to add a commentAdd a comment