లక్నో : ఓ రామచిలుకను పట్టిస్తే రూ.20 వేలు బహుమతిగా ఇస్తామని ఓ రాయల్ ఫ్యామిలీ ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన ఓ రాజకుటుంబ వారసురాలు సనమ్ అలీఖాన్ పౌలీ అనే రామచిలుకను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. అది చెప్పే ముద్దుముద్దు మాటలంటే ఆమెతోపాటు ఆ కుటుంబానికి ఎంతో ఇష్టం. వారి బంధువులు స్కైప్ ద్వారా దానితో మాట్లాడుతూ ముచ్చట పడిపోతుండేవారు. అయితే కొద్దిరోజుల కిందట కుటుంబమంతా ఢిల్లీకి వెళ్లినప్పుడు కేర్ టేకర్ చిలుకను సరిగ్గా చూసుకోలేదు. దీంతో ఆ చిలుక ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి చిలుక జాడ కోసం వెతకని ప్రదేశం లేదు. ప్రాణంగా పెంచుకున్న చిలుక అదృశ్యం కావడంతో యజమాని కుటుంబం చిన్నబోయింది. ఇల్లు బోసిపోయింది. తప్పిపోయిన ఈ చిలుక ఇప్పుడు యూపీలోని రామ్ పూర్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.
ఇక లాభం లేదని చిలుక యజమాని సనమ్ అలీ ఖాన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. చిలుక జాడ చెప్పినవారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఎవరైతే చిలుక పట్టి తెస్తారో వారికి రూ.20వేల రివార్డు ఇస్తామంటూ ఆటో రిక్షాపై లౌడ్ స్పీకర్ తో చాటింపు వేయించారు. ప్రస్తుతం రామ్‌పూర్‌లోని అనేక వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఆ చిలక ఫోటోలు వైరల్‌గా మారాయి. చిలుక జీవితం ఆధారంగా వచ్చిన హాలీవుడ్ మూవీ పౌలీ (1998) చూసిన తర్వాత తాము పెంచుకునే చిలుకకు.. పౌలీ అని పేరు పెట్టినట్టు సనమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment