వారంలోగా అమల్లోకి వెయ్యి పెన్షన్
న్యూఢిల్లీ: భవిష్యనిధి వినియోగదారులు ఈ వారంలోనే నెలకు వెయ్యి రూపాయల కనీస పింఛన్ పొందనున్నారు. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీంతో దాదాపు 28 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. వీరికి ప్రస్తుతం రూ. వెయ్యి కన్నా తక్కువ పెన్షన్ అందుతోంది.
ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా నెలకు వెయ్యి రూపాయల పింఛన్ అందించాలని గత యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల భవిష్యనిధి సంస్థపై రూ.1,217 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం అమలు కాలేదు.
తాజాగా దీనికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ. 15వేలకు పెంచడం, ఈపీఎఫ్‌వోకు సంస్థలు చెల్లించే పాలనా చార్జీలను తగ్గించడం వంటి నిర్ణయాలను కూడా కేంద్రం నోటిఫై చేయనుంది. దీంతో ఈ వారంలోనే ఈ నిర్ణయాలు అమలయ్యే అవకాశముంది.