డెహ్రాడూన్: ప్రకృతి విలయానికి మరుభూమిగా మారిన ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం వెలుపల కోటి 90 లక్షల రూపాయల నగదు గల బ్యాంక్ లాకర్ బయటపడింది. వరదల ధాటికి దెబ్బతిన్న ఉత్తరాఖాండ్లోని ఈ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ చర్యల్లో భాగంగా బురద, బండరాళ్లను తొలగిస్తుండగా ఈ నెల 11న దీన్ని కనుగొన్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్కు చెందిన లాకర్గా గుర్తించినట్టు ఓ సినీయర్ పోలీస్ అధికారి ఒకరు ఆదివారం చెప్పారు. వెంటనే డెహ్రాడూన్ ఎస్బీఐ అధికారులను ఈ సమాచారాన్ని చేరవేశారు.
పోలీసులు, బ్యాంక్ అధికారుల సమక్షంలో శనివారం ఈ లాకర్ను తెరవగా భారీ మొత్తం ఉన్నట్టు గుర్తించారు. ఈ నగదును ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అనూప్ లంబాకు అప్పగించినట్టు రుద్రప్రయాగ ఎస్సీ వరీందర్ జీత్ సింగ్ చెప్పారు. చమోలీ జిల్లాలోనూ ఇటీవల ౩౩ లక్షల రూపాయల గల బ్యాంక్ లాకర్ను కనుగొన్నారు. భారీ వర్షాలు, వరదల ధాటికి కేదార్నాథ్ తదితర ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఎస్బీఐ కార్యాలయం ఉన్న భవనం ధ్వంసమైంది.