న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వైపు కరోనా మహమ్మారి.. మరోవైపు తప్పుడు వార్తల ప్రచారం ప్రపంచంపై దాడి చేస్తోందని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు పరస్పర విశ్వాసం కలిగి ఉండి.. సహాయసహకారాలు అందించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అప్పుడే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ‘అలయన్స్ ఆఫ్ మల్టీలాటరలిజం’(బహుశజాతి కూటమి) వర్చువల్ మీటింగ్‌లో జై శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. 4 లక్షల మందికి పైగా ప్రాణాలు బలితీసుకుంది. (భారత్ గట్టిగా పోరాడుతోంది: మోదీ)
అంతేకాదు మన జీవన విధానం, ఉపాధి, ప్రయాణాలు ఇలా అన్నింటి మీద తీవ్ర ప్రభావం చూపింది. మానవ సహజ, స్వభావసిద్ధమైన జీవన గమనాన్ని మార్చింది. పక్కవారిని చూస్తేనే భయపడే పరిస్థితులు తీసుకువచ్చింది. ఇక ఇందుకు అసత్య వార్తల ప్రచారం కూడా తోడైంది. వదంతుల వల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు పాండెమిక్(మహమ్మారి కరోనా వల్ల తలెత్తిన ఆరోగ్య సంక్షోభం), ఇన్ఫోడెమిక్(సమాచార లోపం) ఈ రెండు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాళ్లుగా నిలిచాయి’’ అని పేర్కొన్నారు. కాబట్టి రాజకీయాలు, విమర్శలు పక్కన పెట్టి పరస్పరం సహకరించుకుంటూ.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మెలగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. (భారత్‌లో 5లక్షలు దాటిన కరోనా కేసులు)
అదే విధంగా.. అంటువ్యాధి ప్రబలడానికి గల కారణాలను విశ్లేషించి.. ఆరోగ్య విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావడం ద్వారా దానిని కట్టడి చేసే మార్గాలు అన్వేషించాలని పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్తులో మహమ్మారిని సంయుక్తంగా, మరింత సమర్థవంతంగా అరికట్టగలమన్నారు. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ఈ మేరకు ప్రతిపాదించిన లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కాగా ప్రపంచ శాంతి స్థాపన, స్థిరత్వం పెంపొందించే ఉద్దేశంతో ఫ్రెంచి, జర్మనీ విదేశాంగ మంత్రులు ‘అలియన్స్ ఫర్ మల్టీలాటరలిజం’(అనధికార నెట్‌వర్క్)ను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment