ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి ప్రభుత్వం భద్రత తగ్గించింది. శివసేన ఎమ్మెల్యే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్యకు భద్రత పెంచారు. ఆయనను జడ్ కేటగిరీకి పెంచి నట్లు బుధవారం ఒక అధికారి చెప్పారు. ఆయా వ్యక్తులకు పొంచివున్న ప్రమాదాలపై మహారాష్ట్ర ప్రభుత్వ కమిటీ సమీక్ష చేపట్టిన అనంతరం భద్రతా పరిధిలో మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. సచిన్, ఆదిత్యతో పాటు మరో 90 మందికి పైగా ప్రముఖుల భద్రతను ఇటీవల జరిగిన సమావేశంలో కమిటీ సమీక్షించినట్లు తెలిపారు.
సచిన్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత ఉండేది. ఎక్స్ కేటగిరీ కింద, ఒక పోలీసు సచిన్‌కు 24 గంటలూ రక్షణ కల్పించేవారు. ఇకపై ఆయన తన ఇంటి నుండి బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా పోలీసు ఎస్కార్ట్ మాత్రం ఇస్తారని తెలిపారు. ఆదిత్య ఠాక్రేకు జెడ్ సెక్యూరిటీ భద్రత కల్పించారు. ఇప్పుడు మరింత ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా ఉంటారు. అంతకు ముందు ఆదిత్యకు వై ప్లస్ భద్రత ఉండేది. సామాజిక కార్యకర్త అన్నా హజారే భద్రతను వై ప్లస్ కేటగిరీ నుంచి జడ్ కేటగిరీకి పెంచినట్లు వెల్లడించారు. బీజేపీ మొదటిదఫా ప్రభుత్వంలోని మంత్రులకు భద్రతా స్థాయిలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment