
సచిన్, గవాస్కర్.. నాకు దేవుళ్లు!
న్యూఢిల్లీ: తన అద్భుత విజయాలతో ప్రపంచ యువలోకానికే ఒక ఐకాన్‌గా అవతరించిన ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి గూగల్ సీఈఓ సుందర్ పిచాయ్ (43). ఆయనకు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ అంటే చాలా అభిమానమట. వాళ్లే తనకు రోల్ మోడల్స్ అని, వారిలా గొప్ప క్రికెటర్ను కావాలని కలలు కనేవాడినని పేర్కొన్నారు. చదువుతో పాటు తనకు ఫుట్బాల్, క్రికెట్ అంటే చాలా ప్రేమించేవాడినన్నారు. రాత్రిళ్లు మేల్కొని మరీ సాకర్ వరల్డ్ కప్‌ను చూసేవాడినని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఇటీవల ఢిల్లీలో శ్రీరాం కాలేజీ విద్యార్థులతో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను నెమరు వేసుకున్నారు. చదువుకునే రోజుల్లోనే చాలామంది క్రికెటర్స్ లాగే తనకూ క్రికెట్ అంటే విపరీతమైన అభిమానమని తెలిపారు. అలా క్రమం తప్పకుండా చూస్తూ క్రికెట్ లెజెండ్స్ సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లకు వీరాభిమానిగా మారిపోయానన్నారు. గవాస్కర్ క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా ఆయనంటే తెలియని అభిమానం ఉండిపోయిందన్నారు. వరల్డ్ కప్ పోటీలు జరిగే సమయంలో తెల్లవారుజామున తన ఫేవరెట్ ఆటలను చూడడం ఇప్పటికీ గుర్తుందని తెలిపారు. బార్సిలోనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంటే విపరీతమైన ఇష్టమన్నారు.
సుందర్ పిచాయ్ ఆగస్టులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశానికి రావడం ఇదే ప్రథమం. గూగుల్ సీఈఓగా అత్యున్నత పదవిని స్వీకరించిన అనంతరం ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఉన్నత భవిత కోసం, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కలలుగనే యువలోకానికి ఆయనో స్పూర్తి ప్రదాతగా మారిపోయారు.