
దిగ్విజయ్ సింగ్ కు కలిసొచ్చింది...!
మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు భారీగా కలిసొచ్చింది. వేతనాలు పెంచాలంటూ గతంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చేసిన డిమాండ్ పై ప్రభుత్వం స్పందించింది. వేతనాలను పెంచుతూ ప్రకటన వెలువరించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కూడ ఏడు రెట్లు జీతం పెరిగింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వేతనాలు పెంపుపై శనివారం ప్రకటన చేశారు. వేతనాలను పెంచాలంటూ బిజెపి, కాంగ్రెస్ చట్టసభ సభ్యుల డిమాండ్ కు శివరాజ్ సింగ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటివారంలోనే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలకు జీతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ తాజా నిర్ణయంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కు కూడ భారీగా ప్రయోజనం కలిగింది. తాజా నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ జీతం కూడ ఏడు రెట్టు పెరిగింది. దీంతో ప్రస్తుతం 26,000 రూపాయలు జీతాన్ని అందుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి ఇకపై నెలకు 1.7 లక్షలు పొందే అవకాశం ఉంది.