
తీర్పు సందర్భంగా బుధవారం జోద్‌పూర్‌లో సల్మాన్
• 18 ఏళ్ల నాటి అక్రమాయుధాల కేసు నుంచి విముక్తి
• సరైన ఆధారాలు లేవని నిర్దోషిగా ప్రకటించిన జోధ్‌పూర్ కోర్టు
జోధ్‌పూర్: పద్దెనిమిది ఏళ్ల క్రితం నాటి అక్రమాయుధాల కేసు నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు విముక్తి లభించింది. ఈ కేసులో జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. బుధవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తీర్పును వెలువరించారు. లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అయుధాలు కలిగి ఉన్నాడని, వాటిని వాడారని చెప్పే సరైన ఆధారాలు లేనందున నిర్దోషిగా ప్రకటించారు. సల్మాన్‌పై ఉన్న 4 కేసుల్లో అక్రమాయుధాల కేసు ఒకటి. చింకారాల వేటకు సంబంధించిన రెండు కేసుల్లో సల్మాన్‌ను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. రెండు కృష్ణజింకల వేటకు సంబంధించిన కేసు విచారణ కొనసాగుతోంది. గత ఏడాది మార్చిలో సల్మాన్ జోధ్‌పూర్ కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చారు.
అటవీ శాఖ తనను ఈ కేసులో ఇరికించిందని విన్నవించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 1998 అక్టోబర్ 1, 2 తేదీల్లో రాజస్తాన్‌లోని కంకానీలో రెండు కృష్ణజింకలను వేటాడాడని, ఇందుకోసం లైసెన్స్ గడువు ముగిసిన ఆయుధాలను కలిగి ఉండటమే కాక.. వాటిని సల్మాన్ వినియోగించాడని అభియోగాలు మోపింది. అయితే జిల్లా యంత్రాంగం ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతి మతిలేని చర్యగా న్యాయస్థానం అభివర్ణించింది. సల్మాన్ వద్ద ఉన్న ఆయుధాలు మూడేళ్ల కాలపరిమితితో 8/8/99 వరకూ చెల్లుబాటు అవుతాయని, అయితే వేటాడినట్టు అభియోగాలు నమోదైన సమయానికి లైసెన్స్‌ను పునరుద్ధరించుకోలేదని, అంతేకానీ అది లైసెన్స్ గడువు పూర్తయినట్టుగా భావించరాదని కోర్టు పేర్కొంది.
లైసెన్స్ గడువు అప్పటికి ముగిసిందని, ఆయుధం గడువు ముగియలేదని, అందువల్ల అతనిపై ఆయుధాల చట్టం సెక్షన్ 3 లేదా సెక్షన్ 21 కింద ప్రాసిక్యూషన్ చేయలేమని స్పష్టం చేసింది. తన సోదరి అల్వీరాతో కలసి సల్మాన్ బుధవారం కోర్టుకు వచ్చారు. తీర్పు తర్వాత సల్మాన్ తన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ నెల 25న ఇదే న్యాయస్థానం ఎదుట కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ఖాన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేయనుంది. కోర్టు తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది బీఎస్ భాటి స్పందిస్తూ.. తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం దీనిపై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు.