జోధ్‌పూర్‌లో సల్మాన్ ఖాన్ (ఫైల్ ఫొటో)
జోధ్‌పూర్ : కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను రాజస్థాన్ జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు హెచ్చరించింది. ఏ పని నిమిత్తమైనా సరే విదేశాలకు వెళ్లాలంటే కండలవీరుడు సల్మాన్ కచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలని కోర్టు సూచించింది. విదేశాలకు వెళ్లాల్సినప్పుడు కచ్చితంగా అనుమతి అనే నిబంధన నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ సల్మాన్ తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. శనివారం, ఆ పిటిషన్ విచారణకు రాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు సల్మాన్ అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లకూడదని కోర్టు తీర్పిచ్చింది. దీంతో పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లాలనుకున్న సల్మాన్ ఆశలు ఆవిరయ్యాయి.
ఆగస్ట్ 10 నుంచి 26 తేదీల మధ్య విదేశాల్లో పర్యటించాల్సి ఉందని సల్మాన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకునేందుకు సల్మాన్ అబుదాబి, మాల్టాలకు వెళ్లాల్సి ఉందని నటుడి లాయర్ కోర్టుకు విన్నవించారు. భరత్ మూవీ షూటింగ్ పనుల్లో సల్మాన్ బిజీగా ఉన్నాడు. కానీ అనుమతి ఉంటేనే విదేశాలకు వెళ్లాలని జోధ్‌పూర్ కోర్టు తెలిపింది. ఈ ఏప్రిల్‌లో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు ప్రకారం.. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించిన అనంతరం సల్మాన్ బెయిల్‌పై విడుదలయ్యారు. (సెల్‌లో సల్మాన్.. ఖైదీ నెంబర్ 106)
కాగా, కృష్ణజింకలను వేటాడిన కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 5న సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. 1998 అక్టోబర్ 1న ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినట్లు నమోదైన కేసులో దోషిగా రుజువైంది. రెండు రోజుల పాటు జోధ్‌పూర్ జైల్లో గడిపిని సల్మాన్ బెయిల్ రాగానే ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లిపోయారు. కాగా, ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలం, జోధ్‌పూర్ వాసి దుష్యంత్ సింగ్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment