ఓ జింక ‘ఆత్మహత్య’ కథ | Twitterati take a dig at Salman Khan's acquittal in the poaching cases | Sakshi
Sakshi News home page

కృష్ణజింకను ఇంతకీ ఎవరు చంపారు..?

Published Fri, Jul 29 2016 9:35 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ఓ జింక ‘ఆత్మహత్య’ కథ - Sakshi

ఓ జింక ‘ఆత్మహత్య’ కథ

గడచిన కొద్దిరోజులుగా.. అంతకు కొద్దినెలల ముందు.. సోషల్ మీడియాలో ‘‘ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ఇండియా’’ అంటూ ట్యాగ్‌లు హల్‌చల్ చేశాయి. ‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..?’’ ప్రశ్న పాతదైపోయింది. ‘‘కృష్ణజింకను ఇంతకీ ఎవరు చంపారు..?’’ అనే కొత్త చిక్కుముడిని విప్పేందుకే నెటిజన్లు గూగుల్‌ను జల్లెడ పడుతున్నారు. ఇంతకూ ఆ జింకను ఎవరు చంపి ఉంటారు..? కొందరు చెప్పేమాట ‘ఏక్‌థా టైగర్’. ఇంకొందరి సందేహం.. ‘‘జింకే తనను తాను ఎందుకు కాల్చుకుని ఉండకూడదూ..’’ అని!!

సల్మాన్ ఖాన్‌ను రాజస్తాన్ హైకోర్టు తాజాగా నిర్దోషిగా ప్రకటించినా.. జింకలను చంపింది సల్మానేనని ఆనాడు జీపు డ్రైవర్‌గా ఉన్న హరీష్ దులానీ చెబుతున్నాడు. కానీ పోలీసుల దర్యాప్తు మాత్రం జింక తనకు తానే కాల్చుకుని చనిపోయిందన్న తీరులో సాగిందని ఫేస్‌బుక్‌లో సెటైర్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటో వివిధ సామాజిక అనుసంధాన  వెబ్‌సైట్లలో వైరల్ అవుతోంది.
 
అనగనగా 1998.. అక్టోబర్ 1.. చీకటి పడుతోంది. ‘ఏక్‌థా టైగర్’కు మెలకువ వచ్చింది. బద్ధకంగా ఒళ్లు విరుచుకుని చుట్టూ చూసింది. బ్రెడ్, బటర్, శాండ్‌విచ్, రోటీ, దాల్... పులికి చిరాకొచ్చింది. ‘డొక్క మాడితే మాత్రం.. పులి గడ్డి తింటుందా..?’ నో చాన్స్! ఒకే ఒక్క జంప్.. వెళ్లి తన వెహికల్‌లో పడింది. బండి రయ్‌య్ మంటూ దూసుకుపోతోంది. దారి మధ్యలో టైగర్ జస్ట్ అలా వెనక్కి ఓ టర్నింగ్ ఇచ్చుకుంది. ఎలా వచ్చి చేరాయో గానీ, అప్పటికే ఓ మగ పులి, మరో మూడు ఆడ పులులు వెనక సీట్లో దర్జాగా కూర్చొని ఉన్నాయి. ఆశగా నాలుకలు వెలుపలికి పెట్టి, నిమిషానికొకసారి చప్పరించుకుంటున్నాయి. కడుపు మాడితే టైగర్ ఎలాగూ వేటాడుతుంది.. మనకీ నాలుగు బోన్స్ దొరక్కపోతాయా అని ఆ పులుల ఆశ!

చిన్నవిషయాలకూ గొప్పలకు పోయే నైజమున్న మన టైగర్.. వెనకాలే కూర్చున్న స్వజాతి జీవుల ముందు తన రాజసం చూపాలనుకుంది. అయితే, ఈసారి రొటీన్‌గా పంజా విసరకూడదు. ఏదైనా డిఫరెంట్‌గా.. స్టైల్‌గా చెయ్యాలి. అసలే వెనకాల మూడు అందమైన ఆడపులులు ఉన్నాయిగా..! కాస్త వెరైటీగా కూడా ఉండాలి ఏం చేసినా..! అందుకే టైగర్ తన పంజాను పీకి అవతల పారేసింది. బదులుగా ఓ గన్ పట్టుకుంది. ‘‘ఏం తింటారు గయ్‌య్‌స్‌స్..!’’ అంటూ స్టైల్‌గా అడిగి హెయిర్‌స్టైల్‌ను సరిచేసుకుంది. వాటినుంచి ఏం సమాధానం వచ్చిందో ఏమో.. వెంటనే వెహికల్ దిగేసి, తుపాకీని ఎక్కుపెట్టింది. దూరంగా మినుకుమినుకుమంటూ రెండు చిన్నపాటి బల్బుల కాంతి.. ‘‘యస్..! దొరికేసింది. అది జింకే అనుకుంటా. రాత్రివేళ కదా.. కనుగుడ్లు మెరుస్తున్నాయి. యుమ్మీ..!’’ అంటూ ట్రిగ్గర్‌ని ఒక్క నొక్కు నొక్కింది.

ఢామ్మ...ని పెద్ద శబ్దం, ఓ పొదల చాటున గిలగిలా కొట్టుకుంటోన్న కృష్ణజింక చప్పుడు చిన్నగా వినిపిస్తోంది. ఎవరూ చూడలేదు కదా.. అన్నట్టుగా ఏక్‌థా టైగర్ చుట్టూ చూసింది. హమ్మయ్య.. ఎవ్వరూ లేరు. కళ్లు మూసుకుని పాలు తాగేయ్యొచ్చు ఇప్పుడు! మిగతా పులులు కూడా కళ్లు మూసుకున్నాయి.

ఈ పనంతా ఏ మార్జాలమో చేస్తే ఓకే.. చెల్లిపోతుంది. వెరైటీగా పులి కళ్లు మూసుకోవడమేంటీ.. అక్కడే వచ్చింది చిక్కంతా. దూరం నుంచి ఎవడో చూసేశాడు. బిష్ణోయ్ కులస్థుడంట. వాడికి పిచ్చిపిచ్చిగా కోపమొచ్చేసింది. ‘‘ఏయ్.. నీ పని పడతా..’’ అంటూ వెంబడించాడు. టైగర్ అలర్ట్ అయింది. వెహికల్ రివ్వున దూసుకుపోయింది. ఈ బిష్ణోయ్ బాబు ఆగలేదు. వెంబడించి వెంబడించి.. వెనక్కి వచ్చేశాడు. తమవాళ్లందరినీ ఓ చోట చేర్చాడు. ‘‘మనం దేవతలా పూజించే జింకలను ఆ ఏక్‌థా టైగర్ చంపేసిందిరా..’’ అంటూ ఏడ్చాడు. అంతే.. తెల్లవారింది. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ నమోదైంది. విచారణ కూడా వెంటనే మొదలైంది. అప్పటి నుంచి అది జీడిపాకంలా సాగుతూనే ఉంది. నిన్నగాక మొన్ననే దీనికి పుల్‌స్టాప్ పడింది. ‘యస్.. టైగర్ నిర్దోషి’!

 ‘‘మరి.. కళ్లారా చూసిన నేనేమవుతానురా..’’ అంటూ ఏడ్చాడు బిష్ణోయ్ బాబు. ‘‘ఉండొచ్చు గానీ, మరీ అంత పిచ్చి ఉండకూడదు. అయినా, జంతువుల మీద ప్రేమ ఏంట్రా. పిచ్చివాడా..’’ అంటూ కొందరు నవ్విపోయారు. మరికొందరు సానుభూతి చూపారు. ‘‘పోనీలే, పోయింది కృష్ణ జింకేగా.. మనకి మన టైగర్ మిగిలింది. అదే పదివేలు’’ అని ఊపిరి పీల్చుకున్నారు ఇంకొందరు దేశభక్తులు. కానీ, కొందరికి మాత్రం ఎప్పుడూ ప్రశ్నలతోనే సావాసం. టైగర్ చంపకుంటే, జింక ఎలా చనిపోయినట్టూ.. అంటూ ఆరాలు తీశారు. దీనికి వినిపించిన సమాధానాలు.. టైగర్ లెసైన్స్‌డ్ గన్ నుంచి ఒక్క తూటా కూడా పేలలేదు. టైగర్ వెహికల్‌లో దొరికిన తూటాల తొడుగులు ఆ తుపాకీ నుంచి వచ్చినవి కాదు. ఒకవేళ వచ్చినా ఆ తూటాలు జంతువులను చంపేంత శక్తిమంతమైనవి కాదు. మొదట్లో వెహికల్‌లో తూటాలు లేనేలేవు. పోలీసుల తనిఖీ తర్వాతే వచ్చిచేరాయి. అంటే.. ఏంటి అర్థం..? పోలీసులే కుట్ర చేశారని కదా..! ఇలా బోలెడన్ని సమాధానాలు ఇప్పటికీ వినిపిస్తాయి.

అన్నీ సందేహం రేకెత్తించే సమాధానాలే.. ఏదీ టైగర్ మీద పడిన మచ్చను చెరిపేలా లేదు. స్పష్టతనిచ్చేలా అసలే లేదు. దీన్నే క్రికెట్ పరిభాషలో ‘‘బెనిఫిట్ ఆఫ్ డౌట్..’’ అంటారు. అంటే.. క్రీజులో బ్యాట్ పట్టుకునే టైగర్‌కు అనుకూలమైన నిర్ణయం అన్నమాట. మరింకేం..? ఇది కూడా అలానే అనుకుందాం. టైగర్‌ను చూసిన ఆనందంలో జింకే తనను తాను కాల్చుకుందని అనుకుందాం. చివరగా.. బెనిఫిట్ ఆఫ్ డౌట్. కృష్ణ జింక అవుట్!!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement