కృష్ణజింకలను వేటాడిన సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష.. లక్ష ఎకరాలు, 4 ఏరువాకలు, ఏటా 3 పంటలు ఏమీ లేకుండా బీడు పెట్టించిన బాబుకూ వాటి ఉసురు తగులుతుంది.
ధర్మం నాలుగు పాదాల నడుస్తోంది. ఇందుకు రెండు కృష్ణజింకలు ప్రాణాలర్పించి సాక్ష్యమిచ్చాయి. ఒక అహంకారం కటకటాల్లో మగ్గుతోంది. నేను మహా గొప్పవాణ్ణి, అతీత మానవుణ్ణి, పేరుంది డబ్బుంది చట్టాల్ని శాసించగల శక్తి ఉంది– అని నమ్మేవారి విశ్వాసాన్ని సమాధి చేసిన సందర్భం ఇది. నటుడు సల్మాన్ ఖాన్‌కి కృష్ణజింకల హత్య కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కాదు, ఆరేళ్లు పడాల్సి ఉందని జంతు ప్రేమికులు కొంచెం నిరాశ చెందారు. శ్రీమతి జయాబచ్చన్ లాంటి బాధ్యతాయుత వ్యక్తులు సల్మాన్‌కి పడిన శిక్షను జీర్ణించుకోలేక అపసవ్యంగా వాపోయారు. శోచనీయం.
ఎత్తుకెత్తు తన శరీరమాంసం కోసి ఇచ్చి, ఒక పావురాన్ని కాపాడిన శిబి చక్రవర్తి ఏలిన నేల మనది. ఒక హంస బాణపు దెబ్బకి నేల వాలడం చూసి విలవిల్లాడిన గౌతముడు మనకు ఆదర్శప్రాయుడు. ఒక కవుజుపిట్ట కిరాతకుడి చేతిలో నేలకూలగా మహర్షి హృదయం ద్రవించింది. ఆయన శోకం ఆది శ్లోకమై, రామకథకు నాంది వాచకమైంది. అహింసని పరమధర్మంగా భావించే వేద భూమి మనది. చదువు సంస్కారం ఉన్న మనిషిలో ఎక్కడ నించి వచ్చిందింత క్రూరత్వం? ‘బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి..’ అని సూటిగా ప్రశ్నించి అతనిపై జాలిపడాలని ఉంది. ఈ రాక్షస క్రీడని ఆనందిస్తూ, పక్కనే ఉండి ప్రోత్సహించిన వారికి కూడా ఎంతో కొంత శిక్ష వడ్డిస్తే బావుండేది. ఇలాంటి తీర్పులు అలాంటి వారికి గుణపాఠాలు కావాలి.
ఇరవై ఏళ్లు నడిచిన ఈ న్యాయ పోరాటంలో నోరులేని కృష్ణజింకల పక్షాన నిలిచినవారు పూనమ్ చంద్ బిష్ణోయ్. ఒక కొండకి ఎదురొడ్డి నిలవడానికి కావలసిన ధైర్య సాహసాలు, ఎందుకూ లొంగని ప్రలోభాలు కారణం. జోథ్‌పూర్ సమీపంలో భగోడాకి ధనిలో సల్మాన్ కృష్ణజింకను తుపాకీతో కాల్చి చంపడాన్ని చూసిన పూనమ్ ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డారు. ఈ బిష్ణోయ్‌లు వైష్ణవుల్లో ఓ శాఖకు చెందినవారు. వీరికి అడవులే ఆలయాలు. వన్యప్రాణులు పూజనీయాలు. ఈ ప్రకృతి ఆరాధకులకు వేరే దేవుళ్లు లేరు. 15వ శతాబ్దంలో వచ్చిన భయంకరమైన కరువులోంచి ‘బిష్ణోయ్’ తెగ ఆవిర్భవించింది. గురు జంభోజి ప్రవక్తగా, ప్రకృతిని పరిరక్షించే ఈ మతం ప్రాచుర్యం పొందింది.
మార్వాడ్ రాజు అభయ్‌సింగ్ 1730లలో సువిశాలమైన రాజభవనాన్ని నిర్మించ తలపెట్టి, చుట్టుపక్కలున్న చేవగల ఖేజ్రీ మానులను నరికి కలప సేకరిం చాలని ఆదేశించాడు. అందుకు అమృతాదేవి అడ్డుకుంది. తనని నరికి చెట్లని నరకమంది. రాజభటులు నిర్దాక్షిణ్యంగా అదే చేశారు. అమృతాదేవి త్యాగాన్ని చూసిన బిష్ణోయ్‌లు నిర్భయంగా చెట్లకు చుట్టుకున్నారు. వందలాదిమంది బలి అయినారు. రాజు కరుణించాడు. ఇది యదార్థ గాథ. బిష్ణోయ్ తల్లులు అనాథ దుప్పి లేడి జింక పిల్లలకు పాలిచ్చి పోషిస్తారట. ఆ అమ్మల మానవత్వానికి జోహార్లు. నాకు వెంటనే చంద్రబాబు ముఖ్య పట్టణం, రాజ ప్రసాదాలు గుర్తుకొచ్చాయి. లక్ష ఎకరాలు, నాలుగు ఏరువాకలు, ఏటా మూడు పంటలు ఏమీ లేకుండా బీడు పెట్టించారు. ఇక చెట్లంటారా లెక్కకు అందవు. చెట్లు కూడా ప్రాణులే. వాటి ఉసురు తగిలి తీరుతుంది. ఎందుకంటే ధర్మం నాలుగు పాదాల నడుస్తోంది.
శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment