అదే గందరగోళం.. వాయిదా పర్వం
అధికార, ప్రతిపక్షాల మధ్య అదేస్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. దాంతో పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ గట్టిగా మందలించారు. అధికారపక్షమైనా, ప్రతిపక్ష సభ్యులైనా ఇలా ప్లకార్డులు ప్రదర్శించడం తగదని, ఏం కావాలో ప్రశాంతంగా చెప్పాలని సూచించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. గట్టిగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించసాగారు. సభను అదుపు చేసేందుకు స్పీకర్ ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. దాంతో ఆమె సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
ఇక రాజ్యసభలో కూడా సభ ప్రారంభమైన కాసేపటి తర్వాత అదే సీన్ కనిపించింది. పెద్దనోట్ల రద్దు, కరువు పరిస్థితుల వల్ల రైతుల కష్టాలు అనే అంశంపై ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ నోటీసు ఇవ్వడంతో.. దానిపై ఆయనను మాట్లాడాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సూచించారు. అయితే అదే సమయంలో అధికార పక్ష సభ్యులు అగస్టా వెస్ట్‌లాండ్ స్కాంపై చర్చకు పట్టుబట్టడంతో రెండు వైపుల నుంచి సభ్యులు తీవ్రంగా వాగ్వాదాలకు దిగారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి అధికార పక్షమే సభ జరగకుండా ఉభయ సభల్లోను అడ్డుకుంటోందని ఆజాద్ మండిపడ్డారు. మధ్యలో సీతారాం ఏచూరి ఏదో మాట్లాడుతున్నా తనకు వినిపించడం లేదని.. మళ్లీ అవకాశం ఇస్తానని చెప్పిన కురియన్.. చివరకు సభను 12 గంటలకు వాయిదా వేశారు.