
పార్లమెంట్‌లో సేమ్ సీన్!
పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగింది. కార్యకలాపాలు ఈ చివరి మూడు రోజులైనా(డిసెంబర్ 16తో ముగుస్తాయి) సజావుగా సాగుతాయన్న ఆశ తొలిరోజే నీరుగారింది.
ఉభయ సభల్లో కొనసాగిన ప్రతిష్టంభన
- మిగిలింది ఇక రెండు రోజులే!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగింది. కార్యకలాపాలు ఈ చివరి మూడు రోజులైనా(డిసెంబర్ 16తో ముగుస్తాయి) సజావుగా సాగుతాయన్న ఆశ తొలిరోజే నీరుగారింది. రాజ్యసభలో మాత్రం వికలాంగుల హక్కుల బిల్లు ఆమోదం విషయంలో అధికార పక్ష విపక్షాల మధ్య కాసేపు సయోధ్య సాధ్యమైంది. ఆ బిల్లుకు సభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, బీఎస్పీ చీఫ్ మాయావతి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎస్పీ సభ్యుడు నరేశ్ అగర్వాల్ నిర్ద్వంద్వంగా మద్దతిచ్చారు. స్వల్ప చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందింది. ఆ వెంటనే.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై వచ్చిన అవినీతి ఆరోపణల అంశంపై మళ్లీ గందరగోళం ప్రారంభమై వాయిదాకు దారితీసింది. లోక్‌సభలో నోట్ల రద్దుకు కిరణ్ రిజిజు అవినీతి అంశం తోడై సభా కార్యక్రమాల ప్రతిష్టంభన బుధవారం కూడా నిరాటంకంగా కొనసాగింది.
రాజ్యసభలో..
వికలాంగుల బిల్లు ఆమోదం సమయంలో మినహా సభలో నిరసనలు, నినాదాలు కొనసాగాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో పవర్‌ప్రాజెక్ట్ నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ లేవనెత్తడానికి ప్రయత్నించగా.. డిప్యూటీ చైర్మన్ కురియన్ అడ్డుకుని నిబంధనలకు అనుగుణంగా సాగాలని సూచించారు. దాంతో, విపక్ష, అధికార పక్ష సభ్యులు పరస్పరం విమర్శలతో కేకలు, నినాదాలు ప్రారంభించారు. గందరగోళం మధ్య సభ గురువారానికి వాయిదా పడింది. తుపానుతో దెబ్బతిన్న తమిళనాడుకు సత్వరమే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్, లెఫ్ట్, డీఎంకేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
లోక్‌సభలో.. పేదలకు అనుకూలించే నోట్ల రద్దు నిర్ణయాన్ని విఫలం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ ప్రభుత్వం లోక్‌సభలో దుయ్యబట్టింది. తమ నేత ఖర్గేకు అవకాశం ఇవ్వకుండా.. అగస్టా స్కామ్ అంశాన్ని లేవనెత్తేందుకు బీజేడీ సభ్యుడు భర్తృహరి మెహతాబ్‌కు అవకాశం ఇవ్వడంపై స్పీకర్ సుమ్రితా మహాజన్‌పై కాంగ్రెస్ చీఫ్ సోనియా సహా ఆ పార్టీ సభ్యులు మండిపడ్డారు. ఆ సమయంలో.. ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు రద్దయిన పాత నోట్ల మార్పిడికి కమిషన్ తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తను మంత్రి అనంత్‌కుమార్ ప్రస్తావించడంతో.. విపక్షాల ఆగ్రహం మరింత పెరిగింది.
గందరగోళం నడుమ సభ గురువారానికి వాయిదా పండింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ.. తదితరులు సభకు హాజరయ్యారు. కాగా,పార్లమెంటు పూర్తిగా స్తంభించిపోయిందని, అక్కడ ఎలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు కొనసాగడం లేదని ఒక తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్తోందని బీజేడీ ఎంపీ బీ మెహతాబ్ రాసిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో స్పీకర్ సుమిత్ర అన్నారు.
మాజీ ఉద్యోగులకు ఆధార్ తప్పనిసరి ప్రతిపాదన లేదు..
కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు పింఛన్ పొందడానికి ఆధార్‌ను తప్పనిసరిచేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని మంత్రి జితేంద్రసింగ్ లోక్‌సభలో చెప్పారు.
దివ్యాంగులపై వివక్ష చూపితే జైలే!
బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: ఇకపై దివ్యాంగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తే కటకటాలు లెక్కించాల్సి వస్తుంది. రెండేళ్ల జైలుశిక్ష అనుభవిం చడంతోపాటు రూ. 5 లక్షల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దివ్యాంగుల హక్కుల బిల్లు–2014ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. దివ్యాంగులకు భద్రత కల్పించి వారి హక్కులను కాపాడ్డానికి రూపొందించిన ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దివ్యాంగులపై వివక్ష చూపితే ఆర్నెళ్ల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించేలా బిల్లులో నిబంధనలున్నాయి. కొన్ని కులాలను ఎస్సీ జాబితా నుంచి ఎస్టీలోకి మార్చడానికి, ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చడానికి ఉద్దేశించిన బిల్లు లోక్‌సభకు వచ్చింది. భూసేకరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటర్తీ కమిటీకి ఎనిమిదోసారి పొడిగించారు. నివేదిక సమర్పణకు బడ్జెట్ సమావేశాల వరకు గడువిచ్చారు.
భారీ ఓడరేవుల బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఓడరేవులు సమర్థవంతంగా పని చేసేందుకు ఉద్దేశించిన భారీ ఓడరేవుల అథారిటీ బిల్లు–2016కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెద్ద ఓడరేవుల ట్రస్ట్‌ల చట్టం–1963 స్థానంలో ఈ బిల్లును తెచ్చింది. బుధవారం ప్రధాని నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ఈ బిల్లుకు పచ్చజెండా ఊపింది. నోట్ల రద్దు అనంతర పరిణామాలపై మోదీ సమీక్ష జరిపారు.