అమితాబ్ తీరును తప్పుబట్టిన నిరుపమ్
ముంబై: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తీరును కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తప్పుబట్టారు. జీఎస్టీతో నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు మొత్తుకుంటుంటే... అమితాబ్ దాన్ని ఎలా ప్రమోట్ చేస్తారని సూటిగా ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేయడం సరికాదని సంజయ్ అభిప్రాయపడ్డారు. తక్షణమే అమితాబ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన ట్విట్ చేశారు.
Would advise @SrBachchan to wthdraw frm brand ambassador of #GST in ths form.An expected backlash frm traders may go against him eventually.
— Sanjay Nirupam (@sanjaynirupam) 20 June 2017
కాగా దేశంలో పన్నుల సంస్కరణకు శ్రీకారం చుడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను తీసుకొస్తోంది. ఈనెల 30 అర్ధరాత్రి నుంచే జీఎస్టీని అమల్లోకి తేనుంది. ఈ నేపథ్యంలో దీనిపై మరింత ప్రచారం కల్పించేందుకు జీఎస్టీ ప్రచారకర్తగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక తెలిసిందే. ఇప్పటికే 40 సెకన్ల్ల నిడివున్న వీడియోను కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) అమితాబ్‌పై చిత్రీకరించి ప్రసారం ప్రారంభించింది. ఈ వీడియోలో జీఎస్టీ విశిష్టతను అమితాబ్ వివరించారు. జాతీయ జెండాలో మూడు రంగుల కలిసి ఉన్నట్లే.. జీఎస్టీ కూడా 'ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్'గా మారేందుకు ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ‘జీఎస్టీ– ఏకీకృత జాతీయ విపణి ఏర్పాటు కోసం తొలి అడుగు’ పేరిట ప్రసారమయ్యే ఈ వీడియోను ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది.
మరోవైపు ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ. 130 లక్షల కోట్లుగా ఉన్న దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖల్ని మార్చేసే ఈ కొత్త పన్ను వ్యవస్థ ప్రారంభోత్సవం కోసం పార్లమెంట్ సెంట్రల్ హాలును వేదికగా ఎంచుకుంది. జూన్ 30 అర్ధరాత్రి సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినవేళ 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ పేరిట సెంట్రల్ హాల్లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసేలా ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.