ముంబై: లోభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న మాజీ ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్‌పై వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.
‘సంజయ్ నిరూపమ్ క్రమశిక్షణారాహిత్యం, పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు’ అని కాంగ్రెస్ పార్టీ జనరల్‌సెక్రటరీ కేసీ వేణు గోపాల్ వెల్లడించారు. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి కూడా పేరును కాంగ్రెస్ పార్టీ తొలగించింది. మాజీ లోక్‌సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ పనిచేసిన సంజయ్ నిరూపమ్.. ఇటీవల సీట్ల పంపిణీ విషయంలో ‘మహావికాశ్ ఆఘాడీ కూటమి’లోని శివసేన(యూబీటీ) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
చదవండి: అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్ వర్గంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బహిష్కరించిన తర్వాత ఎక్స్ వేదికగా సంజయ్ నిరూపమ్ స్పందించారు. ‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ తనను తాను రక్షించుకోవడానికి మరింత శక్తిని కూడదీసుకోవాలి. నేను పార్టీకి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. తదుపరి నా కార్యాచరణను తెలియజేస్తాను’ అని ట్వీట్ చేశారు.
మహావికాశ్ ఆఘాడీ కూటమిలో భాగంగా ముంబైలోని ఆరు స్థానాల్లో నాలుగు సీట్లను శివసేన (యూబీటీ)కి కేటాయించటంపై కాంగ్రస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తాను పోటీ చేద్దామని భావిస్తున్న ముంబై నార్త్ వెస్ట్ స్థానం శివసేన (యూబీటీ) దక్కటంపై సొంతపార్టీపైనే విమర్శల దాడికి దిగారు. అయితే 2014 లోక్‌సభ ఎన్నికలో పోటీ చేసిన సంజయ్ నిరూపమ్ సమీప బీజేపీ అభ్యర్థి గోపాల్‌శెట్టి చేతిలో ఓటమిపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment