![singer neha singh rathore may contest lok sabha elections 2024 - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/9/singer-neha-singh.jpg.webp?itok=Ymp2lnYJ)
Singer Neha Singh Rathore : లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనకు ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు మొదటి విడత అభ్యర్థుల జాబితాలు సైతం విడుదల చేశాయి. అయితే కొన్ని స్థానాలకు అభ్యర్థుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.
తాజాగా జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న చర్చ సాగుతోంది. ముంబైలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో నేహా సింగ్ రాథోడ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆమె కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ సందర్భంగా నేహా సింగ్ రాథోడ్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయమని అడిగితే ఆలోచిస్తానని చెప్పారు. అలాగే త్వరలో తన కొత్త పాటను తీసుకువస్తున్నట్లు తెలిపారు.
దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం అప్పుడే మొదలైపోయింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనప్పటికీ నేతలు తమ కార్యకర్తలు, అనుచరులతో సన్నాహాలు ప్రారంభించారు. ముంబైలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరంలో కార్యకర్తలతో మాట్లాడిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. వ్యక్తిగత విబేధాలను పక్కనబెట్టి పార్టీ కోసం పని చేయాలని కోరారు.
ప్రస్తుతం మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడి లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీట్ల షేరింగ్‌కు ఎలాంటి ఫార్ములా ఖరారు కాలేదు. కానీ అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాయి. కాంగ్రెస్‌తో పాటు, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం మహావికాస్ అఘాడిలో భాగంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment