ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్య గావించబడలేదని, వైఫల్యాల భయంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ కొద్దిమంది గుప్పిట్లో ఉందని చెప్పడం సరైంది కాదని, అదే నిజమైతే రోజూ ఒకరిద్దరు ఆత్మహత్యకు పాల్పడేవారని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో రౌత్ పేర్కొన్నారు. క్రికెట్, రాజకీయాలు సహా ఏ రంగంలోనైనా బంధుప్రీతి ఉంటుందని, ఆయా రంగాల్లో పైకి ఎదిగేందుకు ప్రతిఒక్కరూ గట్టిగా నిలిచి పోరాడాలని అన్నారు. సుశాంత్ మరణంపై మీడియాలో విపరీతంగా కథనాలు రావడం కొనసాగుతోందని, ఆయన మరణాన్ని మీడియా వేడుకగా భావిస్తోందని ఆరోపించారు. (పాట్నాలో సుశాంత్ మెమోరియల్)
ఓ రైతు, లేదా సైనికుడు మరణిస్తే ఇదే తరహా కవరేజ్ ఎందుకు రావడం లేదని దుయ్యబట్టారు. సుశాంత్ మరణంపై ప్రచారాన్ని ఇక ఆపాలని, ఇదే కొనసాగితే ఆత్మహత్యలు ఓ పరంపరలా కొనసాగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుశాంత్ కొద్దిరోజులుగా ఒంటరిగా మిగిలారని, మానసికంగా ఆయన కుదురుగా లేరని రౌత్ చెప్పుకొచ్చారు. సినీ జీవితంలో ఎదగడంలేదనే ఆందోళనతో బాంద్రా నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తుచేశారు. సుశాంత్ లగ్జరీ జీవితం గడిపారని, ఫ్యాన్సీ కార్లతో విలాసవంతంగా జీవించారని, ఆయన ఆర్థికంగానూ మెరుగ్గా ఉందని అన్నారు. సుశాంత్ మరణంతో బాలీవుడ్‌లో బంధుప్రీతిపై కంగనా రనౌత్, సోను నిగం గళమెత్తడాన్ని సంజయ్ రౌత్ ప్రస్తావిస్తూ సినీ పరిశ్రమలో కొత్త వారు వచ్చినప్పుడు ఎవరైతే కష్టపడి తమదైన నైపుణ్యంతో నిలకడగా రాణిస్తారో వారు మంచిపేరు తెచ్చుకుంటారని అన్నారు. (జస్టిస్ ఫర్ సుశాంత్)
Comments
Please login to add a commentAdd a comment