
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సుప్రీంకోర్టు బుధవారం సీబీఐ విచారణకు ఆదేశించిన అనంతరం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ముంబై పోలీసులకు బాసటగా నిలిచారు. ఈ కేసును ముంబై పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై తాను వ్యాఖ్యానించబోనని, చట్టం గురించి అవగాహన కలిగి ప్రభుత్వంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కోర్టు తీర్పుపై స్పందిస్తారని అన్నారు. తాను సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడలేనని, ముంబై పోలీస్ కమిషనర్ లేదా తమ అడ్వకేట్ జనరల్ దీనిపై వ్యాఖ్యానిస్తారని రౌత్ తెలిపారు.
సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పుపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. మహారాష్ట్ర న్యాయ వ‍్యవస్ధ దేశంలోనే మెరుగైనదని, ఇక్కడ ఎవరూ చట్టానికి అతీతులు కారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. పట్నాలో సుశాంత్ మృతిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం చట్టబద్ధమేనని, బిహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment