మళ్లీ నాలుక కాల్చుకున్న స్మృతి ఇరానీ!
న్యూఢిల్లీ: కేంద్ర విశ్వవిద్యాలయాలన్నింటిలో సంస్కృత భాషను విధిగా నేర్పాలంటూ ప్రతిపాదన తీసుకొచ్చి చేతులు కాల్చుకున్న కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి స్మతి ఇరానీ, మళ్లీ అలాంటి ప్రయత్నమే చేసి సోషల్ మీడియాలో నాలిక కాల్చుకున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన దృక్పథాల గురించి తెలుసుకునేందుకు సంస్కత భాష ఎంతో దోహదపడుతుందని, అందుకనే దేశంలోని ఐఐటీలను సంస్కృత భాషను బోధించాల్సిందిగా విజ్ఞప్తి చేశామంటూ స్మతి ఇరానీ లోక్‌సభలో చేసిన ప్రకటనపై సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్‌లో చలోక్తులు పేలుతున్నాయి.
‘స్మతి ఇరానీ ముందుచూపు మూర్ఖులకు ఎప్పటికీ అర్థం కాదు, టైమ్ మిషన్‌లో ప్రాచీనకాలంలోకి వెళ్లినప్పుడు సంస్కృత భాష ఎంతగానో పనికొస్తుంది....థర్మో డైనమిక్స్‌ను సంస్కృతంలో ఏమంటారు?.......హెచ్2ఓ ఫార్ములాను ఇలా రాయాలి: హైడ్రోవరణం ద్వి ఆక్సీవరణం....సీప్లస్‌ప్లస్, జావా, సోల్, పైథాన్, జావా స్క్రిప్టు లాంటి కంప్యూటర్ భాషలను ఒక్క సంస్కృతం మాత్రమే ఎదుర్కోగలదు.....హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ అంటే హిందూ రాష్ట్ర డెవలప్‌మెంట్ మినిస్ట్రీ అనుకుంటున్నట్లుంది.....ఐఐటీలో సంస్కృతం నేర్పడం ఎంతమంచిదో ఇప్పుడర్థం కాదు. అది నేర్చుకునేటప్పుడు తెలుస్తుంది.
ఇంజనీరింగ్ అంటే గ్రీక్, లాటిన్ అని.....ట్విట్టర్ ఇండియాను సంస్కృతంలో ఆపరేట్ చేయాల్సిందిగా ఆదేశించాలి లేదా సంస్కృతం ట్విట్టర్‌ను అభివృద్ధి చేయాల్సిందిగా ఐఐటీ విద్యార్థులను కోరాలి....ఐఐటీల్లో సంస్కృతం నేర్పడం భేష్. ఆ తర్వాత విద్యార్థుల హస్తవాసి చూసి మార్కులు వేయొచ్చు....’ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో వ్యాఖ్యానాలు చేయగా, న్యూటన్స్ చలన సూత్రాలను ఎలా రాయాలో తెలియక తికమకపడుతున్న ఐఐటీ విద్యార్థులను చూసి పగలబడి నవ్వుతున్న స్మతి ఇరానీ అంటూ ఆమె నవ్వే చిత్రాన్ని ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.