కోహినూర్‌పై మీ వైఖరేంటి?
కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తీసుకురావడంపై దాఖలైన ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని కోర్టు శుక్రవారం విచారించింది. దీనిపై తమ వైఖరేమిటో వారంలోగా చెప్పాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ‘పాకిస్తాన్, బంగ్లాదే శ్, దక్షిణాఫ్రికాలు కోహినూర్ మాదే అంటున్నాయి. మనదేశంలోనూ కొంతమంది కోహినూర్ కావాలని అడుగుతున్నారు. ఇలా ఎన్ని దేశాలు అంటాయి?’ అని ప్రశ్నించింది. దీనిపై సమాధానమివ్వడానికి కొంత సమయం కావాలని ఆయన కోరారు.
ఇలాంటి డిమాండ్లను తాము అంగీకరిస్తూ పోతే త్వరలోనే బ్రిటిష్ ప్రదర్శన శాలలు ఖాళీ అవుతాయని బ్రిటన్ ప్రధాని అన్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయని టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘ఈ విషయంపై మీరు ప్రభుత్వాన్ని ఎందుకు ఆశ్రయించరు? ప్రభుత్వం పట్టించుకోలేదా? ప్రభుత్వం చేయదగినదంతా చేసింది’ అని పిటీషనర్‌ను ఉద్దేశించి కోర్టు పేర్కొంది. కోహినూర్‌తో పాటు టిప్పు సుల్తాన్ ఉంగరం, కత్తి, ఇతర భారతీయ రాజుల సంపదలనూ వెనక్కు తేవాలని పిటిషనర్ కోరారు.