న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా అనుమానాస్పద మృతిని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ ప్రత్యేక జడ్జి లోయా 2014 డిసెంబరు 1న తన సహచరుడి కూతురి వివాహా వేడుకకు హాజరవ్వడానికి నాగ్‌పూర్ వెళ్లినప్పుడు మరణించారు. లోయా మృతిపై ఆయన సోదరి గతేడాది నవంబరులో అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం చర్చనీ యాంశమైంది. మృతి కేసులో సుప్రీంకోర్టు స్వతంత్ర విచారణ చేపట్టాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు శుక్రవారం విచారించింది.
లోయా పోస్టుమార్టమ్ నివేదికను సమర్పించాలనీ, కేసు విచారణపై తన స్పందనను ఈ నెల 15లోపు తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టు వద్ద విచారణలో ఉందనీ, దీనిని సుప్రీంకోర్టు కూడా ఇప్పుడే విచారిస్తే హైకోర్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా బాంబే న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాది దుశ్యంత్ దవే కోరారు. అయితే విచారణ సమయంలో వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని జడ్జీలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment