Special Judge
-
టీఎంసీ నేతకు బెయిల్ ఇవ్వాలని జడ్జికి బెదిరింపులు..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్సోల్ సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జికి బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. గోవుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన టీఎంసీ నాయకుడు అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వాలని, లేకపోతే జడ్డి కుటుంబసభ్యులపై నార్కొటిక్ డ్రగ్స్ కేసు పెడతామని ఓ వ్యక్తి బెదిరించాడు. ఈ విషయంపై జడ్జి రాజేశ్ చక్రవర్తి జిల్లా జడ్డికి ఫిర్యాదు చేశారు. బెదిరింపు లేఖను కూడా జత చేశారు. అనుబ్రత మండల్‌కు బెయిల్ ఇవ్వకపోతే తన కుటుంబసభ్యులందరిపై నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(NDPS) కింద కేసు పెడతామని బప్ప చటర్జీ అనే వ్యక్తిపేరుతో లేఖవచ్చిందని జడ్జి పేర్కొన్నారు. నిందితుడు పుర్వ వర్ధమాన్‌లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో హెడ్ క్లర్క్ అని, టీఎంసీ లీడర్నని లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. అనుబ్రత మండల్ అరెస్టయినప్పటికీ సీఎం మమతా బెనర్జీ ఇంకా అతడ్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: మా నాయకుడికి బెయిల్ ఇవ్వు లేకపోతే.. సీబీఐ జడ్జికి బెదిరింపులు -
సోహ్రబుద్దీన్ కేసు: నిందితులకు విముక్తి
సాక్షి, ముంబై : 2005లో సోహ్రబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి ఎన్కౌంటర్ కేసులో మొత్తం 22 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ శుక్రవారం ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులపై నేరాన్ని రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి తప్పిస్తున్నట్టు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి స్పష్టం చేశారు. గుజరాత్, రాజస్ధాన్‌లకు చెందిన పోలీస్ అధికారులే నిందితుల్లో అధికంగా ఉన్నారు. రాజకీయ, ఆర్థిక లబ్ధి కోసమే ఈ హత్యలకు కుట్ర జరిగిందని కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఆరోపించింది. ఇదే కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన బీజేపీ చీఫ్ అమిత్ షాకు గతంలో కేసు నుంచి ఊరట లభించింది. ఆయన పాత్రపై ఆధారాలు లేనందున అమిత్ షాతో గుజరాత్ మాజీ డీజీపీ వంజరాలకు కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది. ఈ కేసులో మొత్తం 210 మంది సాక్షులను కోర్టు విచారించగా వీరిలో 92 మంది అప్రూవర్లుగా మారారు. సోహ్రబుద్దీన్ అపహరణ, ఎన్కౌంటర్ బూటకమని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ గట్టిగా కృషి చేసినా సాక్షులు అప్రూవర్లుగా మారడంతో వారు నోరుమెదపలేదని, ఇందులో ప్రాసిక్యూషన్ తప్పేమీ లేదని కోర్టు పేర్కొంది. సోహ్రబుద్దీన్, తులసీరామ్ ప్రజాపతి కుటుంబాలకు న్యాయస్ధానం విచారం వెలిబుచ్చుతోందని, కోర్టులు కేవలం సాక్ష్యాల ఆధారంగానే పనిచేయాలని వ్యవస్థ, చట్టం నిర్దేశిస్తాయని తీర్పును చదువుతూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్జే శర్మ వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసును తొలుత గుజరాత్ సీఐడీ విచారించగా తదుపరి 2010లో దర్యాప్తును సీబీఐకి బదలాయించారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ సహా ఈ ఘటనలు జరిగిన సమయంలో గుజరాత్ హోంమంత్రిగా వ్యవహరించిన అమిత్ షాను నిందితుల్లో ఒకరిగా చేర్చగా ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ 2014లో కేసు నుంచి విముక్తి కల్పించారు. అసలేం జరిగింది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన హత్యకు కుట్రపన్నిన సోహ్రబుద్దీన్ షేక్ 2005 నవంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడని గుజరాత్ పోలీసులు వెల్లడించారు. అదే ఏడాది నవంబర్ 22న సోహ్రబుద్దీన్, ఆయన భార్య కౌసర్ బి, సహచరుడు తులసీరాం ప్రజాపతిలు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని సంగ్లీకి బస్సులో వెళుతుండగా గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీబీఐ తెలిపింది. నాలుగు రోజుల తర్వాత సోహ్రబుద్దీన్‌ను అహ్మదాబాద్ వద్ద హతమార్చారని, అదృశ్యమైన కౌసర్ బీని నవంబర్ 29న బనస్కంత జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడి అనంతరం హతమార్చారని సీబీఐ ఆరోపించింది. ఇక 2006 డిసెంబర్ 27న గుజరాత్-రాజస్ధాన్ సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు చాప్రి ప్రాంతం వద్ద కాల్చిచంపారని పేర్కొంది. అయితే ప్రజాపతిని ఓ కేసు విచారణ నిమిత్తం అహ్మదాబాద్ నుంచి రాజస్ధాన్‌కు తీసుకువెళుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని ఆపే క్రమంలో జరిపిన కాల్పుల్లో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. నిర్ధోషులుగా బయటపడిన ప్రముఖులు సోహ్రబుద్దీన్ కేసులో బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు గుజరాత్ పోలీసు అధికారి అభయ్ చుడాసమ, రాజస్ధాన్ మాజీ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, మాజీ గుజరాత్ డీజీపీ పీసీ పాండే, సీనియర్ పోలీస్ అధికారి గీతా జోహ్రి తదితరులున్నారు. ఇక తాజా తీర్పులో కేసు నుంచి విముక్తి పొందిన వారిలో అత్యధికులు గుజరాత్, రాజస్ధాన్‌లకు చెందిన దిగువస్ధాయి పోలీసు అధికారులే ఉండటం గమనార్హం. -
జస్టిస్ లోయా మృతి తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా అనుమానాస్పద మృతిని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ ప్రత్యేక జడ్జి లోయా 2014 డిసెంబరు 1న తన సహచరుడి కూతురి వివాహా వేడుకకు హాజరవ్వడానికి నాగ్‌పూర్ వెళ్లినప్పుడు మరణించారు. లోయా మృతిపై ఆయన సోదరి గతేడాది నవంబరులో అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం చర్చనీ యాంశమైంది. మృతి కేసులో సుప్రీంకోర్టు స్వతంత్ర విచారణ చేపట్టాలంటూ దాఖలైన రెండు పిటిషన్లను కోర్టు శుక్రవారం విచారించింది. లోయా పోస్టుమార్టమ్ నివేదికను సమర్పించాలనీ, కేసు విచారణపై తన స్పందనను ఈ నెల 15లోపు తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టు వద్ద విచారణలో ఉందనీ, దీనిని సుప్రీంకోర్టు కూడా ఇప్పుడే విచారిస్తే హైకోర్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా బాంబే న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాది దుశ్యంత్ దవే కోరారు. అయితే విచారణ సమయంలో వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని జడ్జీలు పేర్కొన్నారు. -
కోటికి పడగెత్తిన రేంజర్
విజిలెన్స్ ప్రత్యేక జడ్జి వారెంట్‌తో దాడులు రూ.1.21 కోట్ల ఆస్తుల గుర్తింపు జయపురం: ఆదాయానికి మించి ఆస్తులున్న ఫారెస్ట్ రేంజర్ నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడి నిర్వహించారు. కోటి రూపాయలుపైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కలహండి జిల్లా భవానీపట్న కెగాన్ ఫారెస్ట్ రేంజర్‌గా ప్రసన్నకుమార్ మిశ్ర పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని విజిలెన్స్ ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో భవానీపట్న విజిలెన్స్ ప్రత్యేక కోర్టు జడ్జి మంజూరు చేసిన సెర్చ్‌వారెంట్‌తో మంగళవారం ప్రసన్నకుమార్ నివాసంపైన, బంధువుల ఇళ్లపైన ఏకకాలంలో అధికారులు దాడి చేశారు. భవానీపట్న ఇరిగేషన్ కాలనీలో గల అతని మామగారి ఇల్లు, భవానీపట్నలోని హిల్పట్నలో గల నివాసం, స్వగ్రామమైన పరియగాంలో, కార్యాలయంపై నిర్వహించిన దాడుల్లో రూ.1,21,14,095 విలువగల స్థిరచరాస్తులను గుర్తించారు. భవానీపట్న హిల్‌టౌన్‌లో రూ.38,56,398 విలువ గల 3037 చదరపు అడుగుల వైశాల్యం గల రెండంతస్తుల భవనం, హవాణిపట ఝునాగడ్, రాయగడలలో రూ.15 లక్షల విలువైన ఆరు ప్లాట్లు ఉన్నాయని విజిలెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రసన్నకుమార్, ఆయన భార్య, మామ పేరుతో బ్యాంకుల్లో రూ.46,87,724 నగదు ఉందని, ఎల్ఐసీ, ఇతర బీమా కంపెనీల్లో రూ. 8,55,000 డిపాజిట్లు, రూ.6,92,953 బంగారు నగలు ఉన్నాయి. రూ.4,16,750 విలువ చేసే గృహ పరికరాలు, ఇంటిలో రూ.62,080 నగదు, రూ.45 వేల విలువగల హోండా మోటార్ సైకిల్ ఉన్నాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు. కోటీ 21 లక్షల 14 వేల 905 రూపాయల విలువైన స్థిరచరాస్తులను గుర్తించామని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రేంజర్, అతని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్థిరచరాస్థులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.