కోటికి పడగెత్తిన రేంజర్
విజిలెన్స్ ప్రత్యేక జడ్జి వారెంట్‌తో దాడులు
రూ.1.21 కోట్ల ఆస్తుల గుర్తింపు
జయపురం: ఆదాయానికి మించి ఆస్తులున్న ఫారెస్ట్ రేంజర్ నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడి నిర్వహించారు. కోటి రూపాయలుపైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కలహండి జిల్లా భవానీపట్న కెగాన్ ఫారెస్ట్ రేంజర్‌గా ప్రసన్నకుమార్ మిశ్ర పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని విజిలెన్స్ ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో భవానీపట్న విజిలెన్స్ ప్రత్యేక కోర్టు జడ్జి మంజూరు చేసిన సెర్చ్‌వారెంట్‌తో మంగళవారం ప్రసన్నకుమార్ నివాసంపైన, బంధువుల ఇళ్లపైన ఏకకాలంలో అధికారులు దాడి చేశారు.
భవానీపట్న ఇరిగేషన్ కాలనీలో గల అతని మామగారి ఇల్లు, భవానీపట్నలోని హిల్‌పట్నలో గల నివాసం, స్వగ్రామమైన పరియగాంలో, కార్యాలయంపై నిర్వహించిన దాడుల్లో రూ.1,21,14,095 విలువగల స్థిరచరాస్తులను గుర్తించారు. భవానీపట్న హిల్‌టౌన్‌లో రూ.38,56,398 విలువ గల 3037 చదరపు అడుగుల వైశాల్యం గల రెండంతస్తుల భవనం, హవాణిపట ఝునాగడ్, రాయగడలలో రూ.15 లక్షల విలువైన ఆరు ప్లాట్లు ఉన్నాయని విజిలెన్స్ వర్గాలు తెలిపాయి.
ప్రసన్నకుమార్, ఆయన భార్య, మామ పేరుతో బ్యాంకుల్లో రూ.46,87,724 నగదు ఉందని, ఎల్‌ఐసీ, ఇతర బీమా కంపెనీల్లో రూ. 8,55,000 డిపాజిట్లు, రూ.6,92,953 బంగారు నగలు ఉన్నాయి. రూ.4,16,750 విలువ చేసే గృహ పరికరాలు, ఇంటిలో రూ.62,080 నగదు, రూ.45 వేల విలువగల హోండా మోటార్ సైకిల్ ఉన్నాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు. కోటీ 21 లక్షల 14 వేల 905 రూపాయల విలువైన స్థిరచరాస్తులను గుర్తించామని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రేంజర్, అతని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్థిరచరాస్థులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.