Vigilance raid
-
కోటికి పడగెత్తిన రేంజర్
విజిలెన్స్ ప్రత్యేక జడ్జి వారెంట్‌తో దాడులు రూ.1.21 కోట్ల ఆస్తుల గుర్తింపు జయపురం: ఆదాయానికి మించి ఆస్తులున్న ఫారెస్ట్ రేంజర్ నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడి నిర్వహించారు. కోటి రూపాయలుపైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కలహండి జిల్లా భవానీపట్న కెగాన్ ఫారెస్ట్ రేంజర్‌గా ప్రసన్నకుమార్ మిశ్ర పని చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని విజిలెన్స్ ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో భవానీపట్న విజిలెన్స్ ప్రత్యేక కోర్టు జడ్జి మంజూరు చేసిన సెర్చ్‌వారెంట్‌తో మంగళవారం ప్రసన్నకుమార్ నివాసంపైన, బంధువుల ఇళ్లపైన ఏకకాలంలో అధికారులు దాడి చేశారు. భవానీపట్న ఇరిగేషన్ కాలనీలో గల అతని మామగారి ఇల్లు, భవానీపట్నలోని హిల్పట్నలో గల నివాసం, స్వగ్రామమైన పరియగాంలో, కార్యాలయంపై నిర్వహించిన దాడుల్లో రూ.1,21,14,095 విలువగల స్థిరచరాస్తులను గుర్తించారు. భవానీపట్న హిల్‌టౌన్‌లో రూ.38,56,398 విలువ గల 3037 చదరపు అడుగుల వైశాల్యం గల రెండంతస్తుల భవనం, హవాణిపట ఝునాగడ్, రాయగడలలో రూ.15 లక్షల విలువైన ఆరు ప్లాట్లు ఉన్నాయని విజిలెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రసన్నకుమార్, ఆయన భార్య, మామ పేరుతో బ్యాంకుల్లో రూ.46,87,724 నగదు ఉందని, ఎల్ఐసీ, ఇతర బీమా కంపెనీల్లో రూ. 8,55,000 డిపాజిట్లు, రూ.6,92,953 బంగారు నగలు ఉన్నాయి. రూ.4,16,750 విలువ చేసే గృహ పరికరాలు, ఇంటిలో రూ.62,080 నగదు, రూ.45 వేల విలువగల హోండా మోటార్ సైకిల్ ఉన్నాయని విజిలెన్స్ అధికారులు తెలిపారు. కోటీ 21 లక్షల 14 వేల 905 రూపాయల విలువైన స్థిరచరాస్తులను గుర్తించామని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రేంజర్, అతని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్థిరచరాస్థులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
రేషన్ షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
జిన్నారం (మెదక్) : జిన్నారం మండలంలోని చౌక ధరల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. బొంతపల్లి, జిన్నారం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లోని రికార్డులను, నిల్వ సరుకులను అధికారులు విద్యాకర్‌రెడ్డి, రమేశ్‌కుమార్, సాజత్మియా పరిశీలించారు. బొంతపల్లిలోని ఓ రేషన్ షాపులో కిరోసిన్ కోటాకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవటంతో సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేశారు. అక్రమాలు రుజువైతే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఆయిల్ మిల్లుపై విజిలెన్స్ దాడులు
గార్లదిన్నె (అనంతపురం జిల్లా) : గార్లదిన్నె మండలం కల్లూరులోని రాధాకృష్ణ ఆయిల్ మిల్లుపై సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు రూ.20 లక్షల విలువ చేసే వేరుశనగను సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు, లైసెన్స్ చూపించకపోవడం వల్లే సీజ్ చేస్తున్నట్లు డీసీటీఓ చెన్నయ్య, విజిలెన్స్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. జిల్లా విజిలెన్స్ ఎస్పీ అనిల్ బాబు ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు. -
చెక్‌పోస్ట్ వద్ద విజిలెన్స్ తనిఖీలు
ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సరిహద్దులో ఉన్న పురుషోత్తమపురం చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్ట్ దాటుతున్న వాహనాలన్నింటిని ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న పలు వాహనాలకు తాకీదులు ఇచ్చారు. -
మరిపెడలో విజిలెన్స్ దాడులు
మరిపెడ (వరంగల్) : వరంగల్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో అనుమతులు లేకుండా బయో పెస్టిసైడ్స్ అమ్ముతున్న రెండు షాపులను సీజ్ చేశారు. సుమారు రూ. రెండున్నర లక్షల విలువ గల పురుగుల మందులు స్వాధీనం చేసుకున్నారు. -
కిరాణా దుకాణంపై విజిలెన్స్ దాడులు
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : అక్రమంగా నిల్వ చేసిన పప్పు ధాన్యాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన తాడేపల్లిగూడెంలో శుక్రవారం జరిగింది. తాడేపల్లిగూడెంకు చెందిన ఓ కిరాణ షాపులో కంది పప్పు, మినపప్పు అక్రమంగా నిల్వ చేశారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ షాపుపై దాడి చేసి 23లక్షల 15వేల 700 ల రూపాయల విలువ చేసే కంది పప్పు, మినపప్పు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ అనిల్, సీఐ వెంకటేశ్వరరావు, ఏజీపీవో సత్యనారాయణ, డీసీపీ శేషుకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమంగా ఆహారధాన్యాలు నిలువ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
గోదాములపై విజిలెన్స్ దాడులు
గూడూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా గూడూరులోని పలు పప్పుధాన్యాల గోదాములపై గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 10 లక్షల విలువైన 24 క్వింటాళ్ల కందిపప్పు, 21 క్వింటాళ్ల మినప పప్పు, 34 క్వింటాళ్ల పెసరపప్పు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరతను సృష్టించినందుకుగాను యజమానిపై కేసు నమోదు చేశారు. -
కందిపప్పు అక్రమనిల్వలపై విజిలెన్స్ దాడులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : కందిపప్పును అక్రమంగా నిల్వ ఉంచినవారిపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. నెల్లూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ లక్ష్మీనారయణ ఇంటిపై సోమవారం దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు అక్రమంగా దాచి ఉంచిన రేషన్(పీడీఎస్‌యూ) కందిపప్పును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల విషయాన్ని పసిగట్టిన లక్ష్మీనారాయణ ఈ లోపే పప్పు బస్తాలను పక్కింట్లోకి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. అధికారులు అడ్డుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్పీ రామేశయ్య, డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
పామాయిల్ గోదాములపై దాడులు
గుంతకల్లు (అనంతపురం) : పామాయిల్ గోదాములపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని నాలుగు గోదాములపై విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 47 లక్షల విలువ చేసే అక్రమ పామాయిల్ నిల్వలను సీజ్ చేశారు. -
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
కోవూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని రైస్ మిల్లులపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రైస్ మిల్లుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుందని విజిలెన్స్ ఎస్పీ తెలిపారు. -
పప్పు మిల్లులపై విజిలెన్స్ దాడులు
వినుకొండ (గుంటూరు) : గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని పప్పు మిల్లులపై శనివారం ఉదయం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన రూ.50 లక్షలకు పైగా విలువైన కందిపప్పును ఈ సందర్భంగా సీజ్ చేశారు. సోదాలు మధ్యాహ్నం తర్వాత కూడా కొనసాగుతున్నాయి. -
వెయ్యి బస్తాల శెనగలు స్వాధీనం
ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో విజిలెన్స్ అధికారులు వెయ్యి బస్తాల శెనగలు, పప్పులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సాయిశివ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీస్‌పై శుక్రవారం మధ్యాహ్నం విజిలెన్స్ డీఎస్పీ ఫకృద్దీన్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు జరిపారు. ఈ దాడుల్లో సంస్థలో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.37 లక్షలకు పైగా విలువైన శెనగలను సీజ్ చేశారు. కాగా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
రేషన్ షాపుపై విజిలెన్స్ దాడులు
ముదిగొండ : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలోని రేషన్ దుకాణంపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. రేషన్ షాపు నంబర్ 5 లో అక్రమంగా పెద్ద మొత్తంలో సరుకులు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం, రెండు క్వింటాళ్ల కందిపప్పు, 1.5 క్వింటాళ్ల పంచదారను సీజ్ చేశారు. నిర్వాహకుడు వెంకయ్యపై నిత్యావసరాల చట్టంలోని సెక్షన్ 6ఏ కింద కేసు నమోదు చేశారు. -
238 అక్రమ విద్యుత్ కనెక్షన్ల గుర్తింపు
కోస్గి : కర్నూలు జిల్లా కోస్గి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు సోమవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 238 మంది అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు వాడుతున్నట్టు వెలుగు చూసింది. దీంతో 238 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. రూ.2.44 లక్షల జరిమానా విధించారు. -
మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు
కర్నూలు : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఉల్లిగడ్డలను కొనుగోలు చేస్తున్న కమిషన్ ఏజెంట్లు రైతులకు బిల్లులు ఇవ్వకుండా చిత్తు కాగితాలపై వివరాలు రాసి ఇస్తున్నట్టు గుర్తించారు. రైతులను మోసం చేస్తున్న ముగ్గురు కమిషన్ ఏజెంట్లపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శివకోటి బాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. -
ఎలమంచిలి అటవీశాఖ కార్యాలయంపై విజిలెన్స్ దాడి
ఎలమంచిలిలోని అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశాఖపట్నం తీర ప్రాంతంలోని ఇసుక అక్రమ రవాణాపై అటవీ శాఖ సిబ్బందిని విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందులోభాగంగా దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రికార్డులను పరిశీలిస్తున్నారు. తీర ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేసే క్రమంలో లక్షలాది రూపాయిలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అధికారులు అటవీశాఖ కార్యాలయంపై దాడి చేశారు.