
నీట్ ఫలితాలకు పచ్చజెండా
నీట్–2017 పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. దేశవ్యాప్త వైద్యవిద్య పరీక్ష
విడుదల ప్రక్రియను ప్రారంభించాలని సుప్రీం ఆదేశం
► ఫలితాలు ఆపాలన్న మద్రాసు హైకోర్టు ఉత్తర్వులపై స్టే
► వారం రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్న సీబీఎస్‌ఈ
న్యూఢిల్లీ: నీట్–2017 పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. దేశవ్యాప్త వైద్యవిద్య పరీక్ష ఫలితాలను ఆపాలంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. నీట్–2017 షెడ్యూల్‌ను హైకోర్టు ఉత్తర్వులు నీరుగార్చేవిగా ఉన్నాయని జస్టిస్ పీసీ పంత్, జస్టిస్ దీపక్ గుప్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అధికారులు ఫలితాల విడుదల, కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. గతంలో ప్రకటించిన నీట్–2017 షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు జరగాలని స్పష్టం చేసింది.
హైకోర్టులు నీట్–2017కు సంబంధించిన ఎలాంటి పిటిషన్లనూ స్వీకరించవద్దని.. ఈ ప్రక్రియకు సంబంధించిన విచారణలన్నీ సుప్రీంకోర్టే చేపడుతుందని ఆదేశించింది. ‘గతంలో మేం నిర్ణయించిన నీట్ షెడ్యూల్‌ను మద్రాసు హైకోర్టు ఉత్తర్వులే నీరుగారుస్తున్నాయి. అందుకే ఈ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నాం. అధికారులు మే 7న జరిగిన నీట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం వెల్లడించింది. దీనిపై విచారణను కోర్టు వేసవి సెలవుల తర్వాత (జూలై 3 అనంతరం) చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) మణీందర్ సింగ్ (సీబీఎస్‌ఈ తరపున)తోపాటుగా మద్రాసు హైకోర్టు మే 24న ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన పలు ఇతర పిటిషన్లపైనా సోమవారం కోర్టు విచారించింది.
ఈ అంశంపై హైకోర్టులు తమ పరిధిలోకి వచ్చే పిటిషన్లను స్వీకరించకుండా ఆదేశాలివ్వాలని ఏఎస్‌జీ మణీందర్ సింగ్ కోర్టును కోరారు.మే 7న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షకు 12 లక్షల మంది హాజరయ్యారు. హిందీ, ఆంగ్ల భాషల్లో అవే ప్రశ్నలున్నప్పటికీ.. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయంటూ చాలా మంది కోర్టుకెక్కారు. మరోసారి నీట్ 2017 పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. జూన్ 8న ఫలితాలను వెల్లడించేందుకు సీబీఎస్‌ఈ సిద్ధమైన తరుణంలోనే మద్రాసు హైకోర్టు ఫలితాల విడుదలపై స్టే విధించింది. దీనిపై జూన్ 9న సీబీఎస్‌ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రశ్నా పత్రాల్లో కఠినత అన్ని భాషల్లో ఒకేలా ఉందని.. దీన్ని నిపుణుల కమిటీ కూడా ధ్రువీకరించిందని ఏఎస్‌జీ కోర్టుకు విన్నవించారు.
వారం రోజుల్లో ఫలితాలు
సుప్రీం ఆదేశాలతో నీట్ ఫలితాల ప్రక్రియను సీబీఎస్‌ఈ వేగవంతం చేసింది. ‘ఓఎమ్‌ఆర్ జవాబు పత్రాలను జూన్ 13న వెబ్‌సైట్‌లో పెడతాం. జూన్ 14 సాయంత్రం 5 గంటలవరకు విద్యార్థులు తమ అభ్యంతరాలను వెల్ల డించవచ్చు. జూన్ 15న కీని వెల్లడిస్తాం. జూన్ 16 సాయంత్రం 5 గంటలవరకు విద్యార్థులు తమ అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది’ అని సీబీఎస్‌ఈ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రెండు ప్రక్రియలు పూర్తయ్యాక వారం రోజుల్లోనే తుదిఫలితాలు వెల్లడించనుంది.