
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షపై రాష్ట్రప్రభుత్వం, స్పీకర్, గవర్నర్లకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో తక్షణమే బలపరీక్ష చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్పీకర్, గవర్నర్‌లకు మంగళవారం సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో బదులివ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్‌నాథ్ ప్రభుత్వం సోమవారం బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ లాల్జీ టాండన్ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. మరోవైపు సభను గౌరవించాలని కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో బీజేపీ గూటికి చేరడంతో కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే.