సల్మాన్ ఖాన్
న్యూఢిల్లీ: కష్ణజింక వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. సల్మాన్‌కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు నిలుపుదల చేయడాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ విచారణ జరిపారు. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సల్మాన్‌కు నోటీసు ఇచ్చారు.
1998లో రాజస్థాన్‌లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సందర్భంగా ఓ కష్ణజింకను, రెండు చింకారా జింకలను వేటాడినట్టు సల్మాన్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నటులు సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలం కూడా నిందితులుగా ఉన్నారు. 2006లో ట్రయల్ కోర్టు సల్మాన్‌ఖాన్‌ను దోషిగా నిర్ధారించింది. ఓ కేసులో ఏడాది, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై 2007లో సల్మాన్‌ఖాన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. విదేశాలకు వెళ్లేందుకు అనువుగా ట్రయల్ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలని కోరారు. దీంతో గత ఏడాది నవంబర్‌లో రాజస్థాన్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. దానిపై రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈరోజు సల్మాన్‌కు నోటీస్ జారీ చేసింది.