ఓడినా, గెలిచినా నాదే బాధ్యత: కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా, ఓడినా అందుకు తానే బాధ్యత వహిస్తానని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ పేర్కొన్నారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో.. ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఆ ఓటమితో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధం లేదని చూపే ప్రయత్నంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. కేంద్రమంత్రి, బీజేపీ నేత నిర్మలా సీతారామన్ ఆదివారం బేడీని ఆమె నివాసంలో కలసి గంట సేపు చర్చించారు.
అనంతరం బేడీ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘సర్వే ఎప్పుడూ ఒక సర్వేనే. తుది ఫలితాల కోసం పదో తేదీ వరకూ వేచి చూడాలని భావిస్తున్నాను. ఎందుకంటే కొన్ని అసెంబ్లీ సీట్లలో మార్జిన్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి అది ఎటువైపైనా మొగ్గవచ్చు’’ అని పేర్కొన్నారు. నిర్మల మాట్లాడుతూ.. ‘‘పదో తేదీన ఫలితాలు వచ్చిన తర్వాత మేం మాట్లాడతాం’’ అని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఎదురయ్యే ఫలితానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానన్న కిరణ్‌బేడీ ప్రకటన.. ఆమె వ్యక్తిగత ప్రకటన అని సీతారామన్ తెలిపారు.
ఢిల్లీలో గెలిచేది మేమే...బీజేపీ
ఢిల్లీలో బేడీ సారథ్యంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తంచేసింది. ఆప్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆ పార్టీ కొట్టివేసింది. బీజేపీ ఢిల్లీ విభాగం ఆదివారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్, బేడీ తదితరులు హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయ్ మీడియాతో మాట్లాడారు. ‘బేడీ సారథ్యంలో బీజేపీ సౌకర్యవంతమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనాకు వచ్చాం. మాకు 34 నుంచి 38 సీట్లు వస్తాయి’ అని పేర్కొన్నారు.
కుటుంబంతో గడిపి.. సినిమా చూసి...
ఎన్నికల కోసం వారాల తరబడి తీరికలేకుండా ప్రచారం నిర్వహించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఎన్నికలు ముగియడంతో ఆదివారం రోజంతా విశ్రాంతిగా గడిపారు. మధ్యాహ్నం వరకు భార్య, ఐఐటీ విద్యార్థిని అయిన కుమార్తె, తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం తనింట్లో సీనియర్ నేతలు కొందరితో సమావేశమై రాబోయే ఎన్నికల ఫలితాలపై చర్చించారు. సాయంత్రం 4 గంటలకు కౌశాంబి మల్టీప్లెక్స్‌కు వెళ్లి.. ‘బేబీ’ సినిమా చూశారు. బేడీ కూడా..రోజుంతా విశ్రాంతి తీసుకున్నారు. .
విరాళాల సేకరణలో వెనుకబడ్డ ఆప్
ఢిల్లీ ఎన్నికల రేసులో ఆప్ మిగతా వారికన్నా ముందుండొచ్చు! కానీ.. అసెంబ్లీ ఎన్నికల కోసం రూ. 30 కోట్ల విరాళాలు సేకరించాలనుకున్న లక్ష్యంలో మాత్రం వెనుకబడింది! విరాళాల కోసం వినూత్న కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. దాదాపు రూ. 18 కోట్ల విరాళాలు మాత్రమే సమీకరించగలిగింది.