‘ఢిల్లీ’ పీఠం ‘ఆమ్ ఆద్మీ’దే! | 'Delhi' seat 'admide am! | Sakshi
Sakshi News home page

‘ఢిల్లీ’ పీఠం ‘ఆమ్ ఆద్మీ’దే!

Published Sun, Feb 8 2015 4:40 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

‘ఢిల్లీ’ పీఠం ‘ఆమ్ ఆద్మీ’దే! - Sakshi

‘ఢిల్లీ’ పీఠం ‘ఆమ్ ఆద్మీ’దే!

  • ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడి
  • ఆప్‌కు 31 నుంచి 53 సీట్లు
  • బీజేపీకి 17 - 35 సీట్లు.. కాంగ్రెస్‌కు 0 - 5 సీట్లు
  • న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ జయకేతనం ఎగురవేయనుందని శనివారం పోలింగ్ ముగిసిన అనంతరం పలు సర్వే సంస్థలు, వార్తా చానళ్లు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. పోలింగ్ సరళిని బట్టి నిర్వహించిన మొత్తం ఆరు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఐదు ఫలితాలు.. ఆప్‌కు స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని అంచనా వేయగా.. ఒక ఫలితం మాత్రం విజయం ఆప్ - బీజేపీల మధ్య ఎటైనా ఉండొచ్చంది. మొత్తం మీద.. 70 స్థానాలున్న శాసనసభలో సాధారణ మెజారిటీ 36 స్థానాలు కాగా..  ఆప్‌కు కనీసం 31 స్థానాలు గరిష్టంగా 53 స్థానాలు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి.

    ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని.. ఐదు ఫలితాలు చెప్తున్నాయి. ఆ పార్టీకి కనిష్టంగా 17 సీట్లు గరిష్టంగా 29 సీట్లు వస్తాయని ఐదు సర్వేలు చెప్తే.. ఒక సర్వే మాత్రం 27 నుంచి 35 సీట్లు వస్తాయని చెప్తోంది. ఇక ఈ రెండు పార్టీలకు సుదూరంగా కాంగ్రెస్ నిలుస్తుంద,  ఆ పార్టీకి 0 నుంచి 5 సీట్లు లభించే అవకాశముందని మొత్తం ఎగ్జిట్ పోల్స్ సారాంశం.

    ఈ ఎగ్జిట్ పోల్స్‌ను శనివారం మధ్యాహ్నం 3 గంటల లోపు నిర్వహించినట్లు చెప్తున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 28 సీట్లు లభించగా.. 32 స్థానాలు గెలుచుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 8 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం..49 రోజులకే ఆప్ తన ప్రభుత్వాన్ని రద్దు చేయటం తెలిసిందే.

    ‘చాణక్య’ ఉత్తమ సీఎం కేజ్రీవాల్..

    టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్‌లో ఉత్తమ సీఎం ఎవరు కావచ్చన్న సర్వేలో 53 శాతం మార్కులతో కేజ్రీవాల్ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది. బీజేపీ సీఎం అభ్యర్థి బేడీకి 36 శాతం మందే మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న అజయ్‌మాకెన్‌కు కేవలం ఆరు శాతం మంది మద్దతే లభించినట్లు వివరించింది.

    ఆపే గెలిసే

    మోదీకి ఎదురుదెబ్బ. సాధారణ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌లలో నెగ్గి కశ్మీర్‌లో పీడీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ జైత్రయాత్రకు బ్రేక్ పడుతుంది.
     
    అమిత్ షా‘క్’: 20 మంది దాకా కేంద్రమంత్రులు, 120 మంది ఎంపీలు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దక్షిణాది నాయకులను ప్రచారంలోకి దించినా... ఫలితం రాకపోతే వ్యూహకర్తగా అమిత్ షాకు ఇబ్బందికర పరిస్థితి. సొంతపార్టీ వారిని పక్కనబెట్టి కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా రంగంలోకి దించినా ప్రయోజనం శూన్యం.
     
    మోదీని ఢీకొట్టి గెలిచిన వాడిగా అరవింద్ కేజ్రీవాల్‌కు పేరొస్తుంది. ఢిల్లీ అవతల కూడా విస్తరించడానికి ఆప్ ప్రయత్నిస్తుంది.
     
    సామాజిక కార్యకర్త అన్నా హజారే బృందంలో తన సహచరుడైన కేజ్రీవాల్‌ను ఢీ కొట్టిన కిరణ్ బేడీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌నే నమ్మినట్లు స్పష్టం అవుతుంది.
     
    కాంగ్రెసేతర లౌకికవాదుల్లో ఆప్ విజయం ఆశలు చిగురింపజేస్తుంది. జనతాదళ్‌గా అవతరించనున్న పార్టీలకు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మోదీని తట్టుకొని నిలబడగలమనే విశ్వాసం కలిగిస్తుంది. బీహార్‌లో 2015లో, బెంగాల్‌లో 2016లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకోవాలని ఇప్పటికే కార్యరంగంలోకి దిగిన బీజేపీకి ఢిల్లీ ఫలితం చేదు గుళిక.
     
    భవిష్యత్తులో కేంద్రంతో ఢిల్లీ సర్కారుకు ఘర్షణ తప్పకపోవచ్చు. శాంతిభద్రతలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయి కాబట్టి ఆయన ద్వారా కేంద్రం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి ప్రయత్నించే అవకాశాలుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement