- ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ ఎన్నికలు
- భారీగా తరలివచ్చిన మహిళలు, యువత
- మంగళవారం ఫలితాల వెల్లడి
- విజయంపై ప్రధాన పార్టీల ధీమా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా పూర్తయింది. 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 673 మంది అభ్యర్థుల గెలుపోటములు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఫిబ్రవరి 10న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 1.33 కోట్లమంది ఓటర్లలో దాదాపు 67.14% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 65.86% రికార్డు పోలింగ్ కన్నా ఇది 1.28% అధికం. ఈశాన్య ఢిల్లీలో 69.87%, వాయువ్య ఢిల్లీలో 64%, దక్షిణ ఢిల్లీలో 65.88%, తూర్పు ఢిల్లీలో 68.70%, పశ్చిమ ఢిల్లీలో 68.44%, ఉత్తర ఢిల్లీలో 67.77%, సెంట్రల్ ఢిల్లీలో 68.75% పోలింగ్ నమోదైంది. గోకల్‌పూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 73.46%, ఢిల్లీ కంటోన్మెంట్‌లో అత్యల్పంగా 58.47% పోలింగ్ జరిగింది. ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది.
సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ.. అప్పటికే పోలింగ్ బూత్‌ల ముందు భారీ క్యూలల్లో వేచి చూస్తున్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. భారీ పోలింగ్‌తో తమకే లాభమని బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు పేర్కొన్నాయి. ఉదయమే ఓటేసిన వారిలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, కేంద్రమంత్రులు హర్షవర్ధన్, మేనకాగాంధీ.. తదితర ప్రముఖులున్నారు.
గెలుపు మాదే..
సత్యమే జయిస్తుందని, ఆప్ గెలుపు ఖాయమని న్యూఢిల్లీ నియోజకవర్గంలోని బీకే దత్ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆప్ గెలుపు ఖాయమని చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కిరణ్ బేడీ తోసిపుచ్చారు. మధ్యాహ్నం 3 లోపు జరిగిన పోలింగ్‌పై అంచనాలివని, ఆ తరువాతే భారీగా పోలింగ్ నమోదయిందని, అందువల్ల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవం కాబోవని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ఓడితే పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కాగా, మరోసారి ఆప్‌కు మద్దతివ్వడం కానీ, ఆ పార్టీ నుంచి మద్దతు తీసుకోవడం కాని చేయబోమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తేల్చిచెప్పారు. ప్రభుత్వాన్ని సొంతంగానే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
మహిళలు.. కొత్త ఓటర్లు
ఓటుహక్కును వినియోగించుకునేందుకు మహిళలు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు భారీగా తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో మహిళా భద్రత కీలకమైన ప్రచారాంశం అయిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో మహిళలు, కాలేజీ విద్యార్థినులు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన దాదాపు 1.5 లక్షల మంది యువతీయువకులు కూడా పోలింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రముఖులు బరిలో నిలిచిన నియోజకవర్గాల్లో న్యూఢిల్లీ(అరవింద్ కేజ్రీవాల్-ఆప్; నూపుర్ శర్మ- బీజేపీ), కృష్ణానగర్(కిరణ్ బేడీ), గ్రేటర్ కైలాస్(రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ- కాంగ్రెస్), పటేల్ నగర్(కృష్ణా తీరథ్-బీజేపీ), సదర్‌బజార్(అజయ్ మాకెన్ - కాంగ్రెస్), ద్వారక(అనిల్ శాస్త్రి-లాల్‌బహదూర్ శాస్త్రి మనవడు-ఆప్), పడ్పట్ గంజ్(మనీశ్ సిసోడియా-ఆప్; వీకే బిన్నీ-బీజేపీ), మాలవీయనగర్(సోమ్‌నాథ్ భారతి-ఆప్).. మొదలైనవి ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడైన మంజీత్ సింగ్ సర్కా అకాలీదళ్ అభ్యర్థిగా రాజోరీ గార్డెన్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ పడ్తున్నారు.
బీజేపీ వర్సెస్ కేజ్రీవాల్
గత 16 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ.. ఈ సారి విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డింది. పార్టీ తురుపుముక్క ప్రధాని మోదీ సహా అగ్రశ్రేణి నేతలంతా ఢిల్లీ వీధుల్లో ప్రచారం నిర్వహించారు. కేవలం ఆప్, కేజ్రీవాల్‌లు లక్ష్యంగా వారందరి ప్రచారం సాగడం విశేషం. మరోవైపు, ఒకే ఒక్కడుగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. 2013 ఎన్నికల అనంతరం 49 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేయడం తప్పేనని, ఈసారి ఆ పొరపాటు చేయనని, ఆప్‌కు పూర్తి మెజారిటీ ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ పాలనపై రిఫరెండంగా ఈ ఎన్నికలను ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర నామమాత్రంగానే కనిపిస్తోంది.
రూ. 40 లక్షల నగదు, రూ. 74 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, 40 అక్రమ ఆయుధాలు, రూ. 1.26 కోట్ల విలువైన 53,395 లీటర్ల అక్రమ మద్యాన్ని ఎన్నికల సంఘం నియమించిన నిఘా బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఓటర్లను మభ్యపెట్టడానికి సంబంధించి 44 కేసులను నమోదు చేశాయి. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి 60 పెయిడ్ న్యూస్ కేసులు కూడా నమోదయ్యాయి. 2013 ఎన్నికల సమయంలో రూ. 2.14 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడం గమనార్హం.