ఢిల్లీ ఎన్నికలు, బిహార్‌పై మోదీ చర్చ
- అమిత్, కేంద్ర మంత్రులతో భేటీ
- బిహార్ బీజేపీ నేతలతో కలసి అమిత్ షా వ్యూహం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, బిహార్ రాజకీ య పరిస్థితిపై శనివారం బీజేపీ సీనియర్ నేతలతో తన నివాసంలో సమావేశమై చర్చించారు. ఢిల్లీ పోలింగ్ సరళి, పార్టీ విజయావకాశాలను సమీక్షించారని విశ్వసనీయ వర్గాలు చెప్పా యి. సమావేశానికి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, పార్టీ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) రామ్ లాల్‌లు హాజరయ్యారు. బీజేపీ అధికారం దక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న బిహార్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై మోదీ చర్చించారు.
అంతకుముందు అమిత్ షా తన నివాసంలో బిహార్ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. బిహార్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆ రాష్ట్ర పార్టీ నేతలతో కలిసి రచించారు. భేటీలో మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత నందకిశోర్ యాదవ్ ఉన్నారు. బిహార్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని యాదవ్ తెలి పారు.
మహాదళితుడైన మంఝికి నితీశ్ కుమార్ అన్యాయం చేశారని ఆరోపించారు. అంతకుముందు యాదవ్, కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, అనంత్‌కుమార్‌లు బీజేపీ కార్యాలయంలో అమిత్ షాను కలిశారు. తాజా పరిస్థితిపై బీజేపీ అధికారికంగా ఏమీ చెప్పకున్నా, మంఝి ఢిల్లీలో బీజేపీ నేతలను కలిసే అవకాశముందని, ఆయన పట్నా నుంచి బయల్దేరారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.