లక్నో : బ్యాంకులో దోపిడీ జరుగుతోందంటూ అలారం మోగిందని సమాచారం రావడంతో పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన తరలివెళ్లిన ఖాకీలకు ఎలుకలు కనిపించడంతో విస్తుపోయారు. బ్యాంకులో దోపిడీ జరిగినట్టు గానీ తాళాలు పగులగొట్టిన ఆనవాళ్లు లేకపోగా ఎలుకలు అటూఇటూ తిరుగుతూ కనిపించాయి. నగరంలోని ఓ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో అలారం మోగిన శబ్ధం వినిపించిందంటూ స్ధానికులు, బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు.
అయితే అక్కడ దోపిడీ జరిగిన తీరుతెన్నులు లేకపోవడం, కొద్ది సంఖ్యలో ఎలుకలు అలారం వద్ద పోగవడంతో అలారం మోగించింది ఎలుకలే అంటూ పోలీసులు తేల్చేశారు. ఎలుకలు చేసిన పనికే సైరెన్ మోగిందని ఖాకీలు చెప్పారు. కృష్ణాష్టమి కావడంతో బ్యాంకు అధికారులెవరూ బ్రాంచ్‌లో లేరని పోలీసులు చెప్పారు. కాగా అసోంలో ఇటీవల ఏటీఎం యంత్రంలోని రూ 12 లక్షల నగదును ఎలుకలు కొరికి తినేసిన ఘటనను ప్రస్తావిస్తూ అదృష్టవశాత్తూ బ్యాంకులో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని స్ధానికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment