సాక్షి, న్యూఢిల్లీ : సైన్యంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్‌లపై ఢిల్లీ కోర్టులో దేశద్రోహం ఫిర్యాదు నమోదైంది. పటియాలా హౌస్ కోర్టులో న్యాయవాది శశభూషణ్ఈ మేరకు ఫిర్యాదు దాఖలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో సైనిక ఆపరేషన్లలో ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలనే ఎక్కువగా హతమారుస్తున్నారని గులాం నబీ ఆజాద్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆజాద్‌పై దేశద్రోహం, నేరపూరిత కుట్ర, సైన్యంపై వదంతులు వ్యాప్తిం చేయడం వంటి అభియోగాలు నమోదు చేసి చర్యలు చేపట్టాలని శశిభూషణ్ కోర్టును అభ్యర్థించారు.
సైన్యాన్ని అమాయకులను హతమార్చే కిల్లర్లుగా పేర్కొనడమంటే దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం కంటే ఏమాత్రం తక్కువ కాదని పిటిషనర్ తన అప్పీల్‌లో పేర్కొన్నారు. మరోవైపు కాశ్మీరీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న పర్వేజ్ ముషారఫ్ ప్రతిపాదనను సమర్ధించారన్న మాజీ కేంద్ర మంత్రి సైఫుద్దీన్ సోజ్‌పైనా దేశద్రోహ అభియోగాలు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని సోజ్ ఆరోపించారు. తాను రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా సోజ్ మాట్లాడుతూ పొరుగుదేశంతో యుద్ధాన్ని నివారించేందుకు కశ్మీర్‌ను పాక్‌కు అప్పగించేందుకు వల్లభాయ్ పటేల్ సిద్ధమయ్యారని, ఈ మేరకు పాక్ తొలిప్రధాని లయాఖత్ అలీ ఖాన్‌తో మంతనాలు జరిపారని సోజ్ వ్యాఖ్యానించారు.
కశ్మీర్ అంశాన్ని ఐరాసలో లార్డ్ మౌంట్‌బాటెన్ ప్రస్తావించారని, జవహర్‌లాల్ నెహ్రూ కాదని ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. తన పుస్తకానికి ప్రాచుర్యం కల్పించుకునేందుకే సోజ్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment